అరెస్టు ఆందోళన.. ముందస్తు బెయిల్ కోసం సజ్జల.. ఆయన కుమారుడు

జగన్ సర్కారులో సజ్జల రామక్ఱిష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తే.. ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియాకు కన్వీనర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Update: 2025-03-02 05:11 GMT

ఐదేళ్ల వైసీపీ సర్కారులో అంతా తానై నడిపించిన వైసీపీ సీనియర్ నేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఆయన కుమారుడు ఇప్పుడు అరెస్టు ఆందోళనలో ఉన్నారు. తాజాగా వారు కోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ మంజూరుచేయాలని కోరారు. జగన్ సర్కారులో సజ్జల రామక్ఱిష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తే.. ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియాకు కన్వీనర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

తాజాగా సీనియర్ నటుడు.. వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళి అరెస్టు వేళ.. పోలీసు విచారణలో తాను బూతులు తిట్టేందుకు అవసరమైన స్క్రిప్టును సజ్జల రామక్రిష్ణారెడ్డినే సమర్పించారని చెప్పినట్టు వార్తలు రావడం తెలిసిందే . ఈ నేపథ్యంలో సజ్జల.. ఆయన కుమారుడు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. లోకేశ్ లను ఉద్దేశిస్తూ పోసాని తిట్టిన తిట్ల వెనుక ఉన్నది తండ్రీకొడుకులే అన్న విషయాన్ని పోసాని పోలీసుల ఎదుట ఒప్పుకున్న వేళ.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు పిటిషన్ దాఖలు చేశారు.

తాము అమాయకులమని.. పోసాని క్రిష్ణమురళి తమ పేర్లను పోలీసుల ముందు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘మేం అమాయకులం. మమ్మల్ని అనవసరంగా ఈ కేసులోకి లాగుతున్నారు. కస్టడీలో పోసాని చెప్పిన వివరాలు మినహా.. మాకు ఈ నేరంలో పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు’’ అని పేర్కొన్నారు. రాజకీయ ప్రతీకారంతో మమ్మల్ని తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వెల్లడించారు.

తమకు గుంటూరు జిల్లాలో.. పులివెందులలో శాశ్విత నివాసాలు ఉన్నాయని.. తప్పించుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ఎదుట హాజరవుతామని.. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకొని తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వారు హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. మరి.. న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News