కుప్పంలోనూ ఫ్యానే... ఫలితాలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు!

ఈ సమయంలో గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువగా గెలవడమే కాదు.. వైసీపీ గెలిచే స్థానాల్లో కుప్పం కూడా ఉండబోతోంది అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-17 11:42 GMT

ఏపీలో పోలింగ్ ముగిసిన రెండు మూడు రోజుల పాటి కూటమి అధికారంలోకి రాబోతుందంటూ ఒక వర్గం మీడియాలో రకరకాల విశ్లేషణలు తెరపైకి రావడం, ఆ దిశగానే బెట్టింగులు జరుగుతున్నాయనే కథనాలు రావడం తెలిసిందే. అయితే... గత 24 గంటలుగా మాత్రం ఒక్కసారిగా చర్చలు మారిపోయాయి. ఏపీలో రాబోయేది మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వమే అనే కామెంట్లు తెరపైకి వచ్చాయి!

ఈ సమయంలో గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువగా గెలవడమే కాదు.. వైసీపీ గెలిచే స్థానాల్లో కుప్పం కూడా ఉండబోతోంది అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఓటింగ్‌ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దని తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ అబ్జర్వర్ గా వచ్చిన వ్యక్తి అధికారులను, పోలీసులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రస్తుతం పాలన ఈసీ పరిధిలో ఉండటంతో.. టీడీపీ తన ఏజెంట్లను నియమించుకుందని.. వ్యవస్ధలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలనేది చంద్రబాబు నైజం అని ఈ సందర్భంగా సజ్జల దుయ్యబట్టారు. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాను మారిస్తే.. అంతా దారిలోకి వస్తుందని అన్నారు.

ఇదే క్రమంలో... చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదని.. ఆయన పూర్తిగా నెగిటివ్‌ క్యాంపెన్‌ నే నమ్ముకున్నారని.. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్ పై అర్థంలేని ఆరోపణలు చేశారని దుయ్యబట్టిన సజ్జల... చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదని పేర్కొన్నారు. మరోపక్క సీఎం వైఎస్ జగన్‌ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పిన సజ్జల... కుప్పంలోనూ వైసీపీ గెలవబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన సజ్జల... మళ్లీ అధికారంలోకి వస్తున్నామని.. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మొత్తం తమవైపే ఉందని తెలిపారు. అయితే... తమకు కాన్ఫిడెన్స్ మాత్రమే ఉంది తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ లేదని చెప్పిన సజ్జల... ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తామని అన్నారు.

ప్రధానంగా... వాళ్లిచ్చిన హామీలను కూడా చంద్రబాబు సరిగా ప్రచారం చేసుకోలేకపోయారని ఎద్దేవా చేసిన ఆయన.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను, జగన్‌ ను విమర్శించడంతోనే చంద్రబాబు ఎన్నికల ప్రచారం ముగిసిందని.. కేవలం జగన్ ని విమర్శించడం వల్ల లబ్ది పొందే ప్రయత్నం మాత్రమే చేశారని అన్నారు. అయితే... ప్రజలు మాత్రం వైసీపీని సొంతం చేసుకున్నారని తెలిపారు.

ఇక పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి... తాడిపత్రి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను పోలీసులే ధ్వంసం చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. అవసాన దశలో కూడా చంద్రబాబు పద్దతి మారలేదని ఫైర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన తప్పుడు ప్రచారం ఫలితం చంద్రబాబుకు జూన్ 4వ తేదీన తెలుస్తుందని అన్నారు.

Tags:    

Similar News