పోలింగ్ సరళిపై బాబు అలా... సజ్జల ఇలా !

నాయకులు ప్రచారం కోసం ఎన్ని రోజులుగానో ఎండలలో తిరిగారు కానీ ఓటరు ఒక్క రోజు అంతటి ఎండనూ భరిస్తూ ఓటు వేసి తన తీర్పు ఏంటో స్పష్టంగా చాటి చెప్పాడు.

Update: 2024-05-13 15:14 GMT

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. ఓటర్లు మండే ఎండను ఓడించి మరీ ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. నాయకులు ప్రచారం కోసం ఎన్ని రోజులుగానో ఎండలలో తిరిగారు కానీ ఓటరు ఒక్క రోజు అంతటి ఎండనూ భరిస్తూ ఓటు వేసి తన తీర్పు ఏంటో స్పష్టంగా చాటి చెప్పాడు.

ఓటరు ఇచ్చిన తీర్పుని ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఇంతటి భారీ పోలింగ్ ఏపీలో అధికార మార్పునకు సంకేతం అని అన్నారు ఆయన తాజాగా ట్వీట్ చేస్తూ ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని, ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చి ఓట్లు వేయడంపై ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం అని అభివర్ణించారు. ప్రజల సంకల్పం, వారి ఉత్సాహం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటలకు ఎంత పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద ఉన్నారో, పోలింగ్ ముగిసే సమయంలో కూడా అంతే ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రజలు ఓటింగ్ పై ఇంత ఉత్సాహం ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం అని పేర్కొన్నారు. ప్రజల చైతన్యం చూస్తుంటే ఈ రాత్రి వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ జరిగిందని, ఈసారి ప్రజలు ఊపు చూస్తుంటే 85 శాతం పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందని తెలిపారు.

ఇక పోలింగ్ ముగిసిన తరువాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి వైసీపీ ఆఫీసులో మీడియా సమావేశం పెట్టి ప్రజలు వైసీపీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఎపుడో డిసైడ్ అయిపోయారు అని అన్నారు.

ఉప్పెనలా పోలింగ్ బూతులకు జనాలు తరలి వచ్చి మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకుని రావాలని దీవించారు అని అన్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం టీడీపీ తామే గెలుస్తామని ధీమాగా ఉంది. వైసీపీలోనూ అదే నమ్మకం కనిపిస్తోంది. చూడాలి మరి ఎవరి జాతకం ఏమిటి అన్నది జూన్ 4న తేలనుంది.

Tags:    

Similar News