పవన్ కు రిటర్న్ గిఫ్ట్ గా ...?

వారాహి రధమెక్కి పవన్ గత నాలుగు విడతలుగా గట్టిగానే మాట్లాడారు. ఏకంగా జగన్ని పట్టుకుని ఏకవచన ప్రయోగం చేశారు

Update: 2023-10-14 03:36 GMT

వారాహి రధమెక్కి పవన్ గత నాలుగు విడతలుగా గట్టిగానే మాట్లాడారు. ఏకంగా జగన్ని పట్టుకుని ఏకవచన ప్రయోగం చేశారు. నేను జగన్ కి గౌరవం ఇవ్వను అన్నారు. జగన్ గురించి నాకు ఎంతో తెలుసు అంటూ చాలా చెబుతూ వస్తున్నారు. జగన్ నీ స్థాయి ఎంత అని గద్దిస్తున్నారు. కోపం వస్తే ఈ జనాలు జగన్న్ గద్దె మీద నుంచి లాగి చంపేస్తారు అని కూడా ఇదే పవన్ అన్నారు.

ఇంతలా జగన్ గురించి మాట్లాడినా వైసీపీ నుంచి కొందరు నేతలు మాత్రమే రియాక్ట్ అయ్యారు. మరి ఆ డోస్ సరిపోలేదో ఏమో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి వచ్చేసారు. అదే సామర్లకోట స్పీచ్. నిజానికి దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అని తన ప్రసంగాలలో పవన్ని ఆడేసుకుంటూ ఉంటారు జగన్.

కానీ దాంతో పాటు మరోసారి ఆయన మూడు పెళ్ళిళ్ల ప్రస్థావన తీసుకుని వచ్చారు. లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ అంటూ జగన్ చేసిన విమర్శలు ఇపుడు జనసేనను బాగా డిస్టర్బ్ చేశాయి. జగన్ అన్న దాని మీద జనసేన మండిపోతోంది. వీర మహిళలూ ఏమి చేస్తున్నారు ఈ సీఎం మీద పోరాటం చేయండి అని నాదెండ్ల మనోహర్ పిలుపు ఇచ్చారంటే జనసేనాని ఎంతలా ఫైర్ అవుతున్నారో అర్ధం చేసుకోవాలి.

వెనువెంటనే జవాబు ఇచ్చేందుకు పవన్ ఎపుడూ సిద్ధంగా ఉండరు అంత మాత్రం చేత ఆయన సైలెంట్ గా ఉంటారని కాదు, ఆయన షూటింగ్ గ్యాప్ లో అయినా లేక మరో మీటింగులో అయినా జనాల వద్దకు వచ్చినపుడు మాత్రం కచ్చితంగా జగన్ మీద బాగా విరుచుకుపడతారు. అది వేరే విషయం. ఇంతలో జగన్ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ జనసేన నేతలు ఎక్కడికక్కడ గట్టిగా రియాక్ట్ అవుతున్నారు.

అయితే దాని మీద ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. పీఠాధిపతిలా సందేశాలు ఇస్తూ జనాలను ఏదో ఉద్ధరిస్తానని నీతులు చెబుతూంటే ఇలాగే అనాల్సి వస్తుంది అని అసలు విషయం చెప్పుకొచ్చారు. చచ్చినట్లుగా జవాబు చెప్పాలి. లేకపోతే సిగ్గుతో మౌనంగా ఉండాలని పవన్ కి రెండు ఆప్షన్లు ఇచ్చేశారు.

ప్రజా జీవితంలోకి వచ్చినపుడు తప్పనిసరిగా ప్రశ్నిస్తాం, నాయకుడు అవుదామనుకుంటున్న వారికి నైతికత అవసరం లేదా అని సజ్జల నిలదీస్తున్నారు. పోనీ అని ఊరుకున్నా పవన్ స్థాయిని దాటిపోయి విమర్శలు చేస్తున్నారు అన్నట్లుగా సజ్జల మాట్లాడారు. పీఠాదిపతిలా సమాజానికి సందేశాలు ఇస్తాను ముందుకు నడిపిస్తాను అంటే ఇక్కడ కుదరదంతే అని చెప్పేశారు.

అంటే పవన్ టోటల్ వారాహి యాత్రలకు జగన్ మీద చేసిన విమర్శలకు ఇది రిటర్న్ గిఫ్ట్ అన్న మాట. అది కూడా జస్ట్ శాంపిల్ అని అంటున్నారు అసలు కధ ఇంకా ఉంది అంటున్నారు. ఇక పవన్ మీద జగన్ అన్న దాంట్లో తప్పేముంది అన్నీ సత్యాలే కదా అని వైవీ సుబ్బారెడ్డి వంటి వారు కూడా అంటున్నారు.

మొత్తానికి పవన్ మూడు పెళ్ళిళ్ల వివాదం నుంచి రాజకీయంగా దెబ్బతీయాలని వైసీపీ చూస్తోంది. పవన్ దాని నుంచి తప్పించుకోలేని పరిస్థితి. ఇక్కడ చాలా విషయాలు ముందుకు వస్తాయి. పొరుగున్న ఉన్న కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టారు. ఆయన కూడా వైవాహిక జీవితంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మరి కమల్ మీద తమిళనాడు లో ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఎందుకు గట్టిగా మాట్లాడవు అంటే దానికీ జవాబు ఉంది అంటారు.

కమల్ తన పార్టీ సిద్ధాంతాలను చెప్పుకున్నారు. ఓటు వేయమని అడుతున్నారు. ప్రత్యర్ధులను కూడా సిద్ధాంతాల మేరకే విమర్శలు చేస్తున్నారు. ఎవరి మీద వ్యక్తిగత కషతో రాజకీయ ద్వేషంతో విమర్శలు చేయడం టార్గెట్ చేయడం లేదు. ఫలనా వారినీ సీఎం కానీయను అని అనడం లేదు. బీజేపీ మోడీ విధానాలు అంటే పడని కమల్ తన విమర్శలను కూడా రాజకీయ పరిభాషలోనే చేస్తున్నారు. అందుకే ఆయన పర్సనల్ జోలికి ఎవరూ వెళ్ళడంలేదు అంటున్నారు.

ఇక్కడ పవన్ మాత్రం జగన్ చిన్నతనంలో ఫలనా పోలీసుని కొట్టారు, పరీక్ష పేపర్లు దొంగిలించారు. మీకు ఎవరికీ తెలియని జగన్ నాకు తెలుసు అంటూ అవి నిజాలో కావో తెలియనివి తరచూ ప్రచారం చేస్తున్నారు. ఈ బాధ అయితే వైసీపీ నేతలకు ఉంది. మరి తమ అధినేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న పవన్ వ్యక్తిగతం అది కూడా అందరికీ తెలిసిన విషయాలను చెబితే తప్పు ఏంటి అంటున్నారు. ఇక సజ్జల అయితే చేతనైతే మేము అడిగే వాటిని జవాబు ఇవ్వు. లేకపోతే మౌనంగా ఉండు అంటున్నారు. మరి దీని మీద జనసేనాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలంటే ఆయన వారాహి యాత్ర అయిదవ విడత వరకూ ఆగాల్సిందే.

Tags:    

Similar News