కధ...స్క్రీన్ ప్లే...దర్శకత్వం చంద్రబాబే ...సజ్జల సంచలన కామెంట్స్

స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ అతి పెద్ద స్కాం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.

Update: 2023-09-10 14:13 GMT

స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ అతి పెద్ద స్కాం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. దాదాపుగా 370 కోట్ల రూపాయలను స్కాం చేశారని, దీని వెనక కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ చంద్రబాబే అని ఏపీ సీఐడీ నిరూపించిందని సజ్జల అన్నారు.

చంద్రబాబుని ఈ కేసు విషయంలో అన్ని ఆధారాలు చూపించే అరెస్ట్ చేసింది అని ఆయన అన్నారు. చంద్రబాబు నిప్పుని అంటారని, ఇపుడు ఏమని చెబుతారు అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల మీద చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ వేసిన చిందులు అంతా చూసారని ఆయన అన్నారు.

చంద్రబాబు నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్ లో వచ్చి ఉంటే ఒక రోజు కలసివచ్చేదని ఆయన అన్నారు. అలా కాకుండా పబ్లిసిటీ కోసం అల్లర్లను చేయడం కోసమే బాబు కారులో వచ్చారని అన్నారు. తప్పు చేయకపోతే ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో రోజుకు కోటిన్నర పెట్టి లాయర్ ని ఎందుకు తెప్పించుకున్నారని సజ్జల ప్రశ్నించారు.

ఇక దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే విజయవాడ రోడ్ల మీద రాత్రి ఇంట్లో బెడ్ మీద పడుక్కునట్లుగా పడుక్కుని వేసిన విన్యాసాలు ఏంటి అని ఆయన నిలదీశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేద్దామని గత రెండు రోజులుగా చూశారని సజ్జల విమర్శించారు. అయినా సరే పోలీసులు అంతా కంట్రోల్ లోకి తీసుకుని ఏపీని కూల్ గా ఉంచగలిగారు అని ఆయన అన్నారు

ప్రజల సొమ్ముకు సంబంధించిన మొత్తాలను అవినీతి చేస్తే కేసులు పెట్టకూడదా అని ఆయన ప్రశ్నించారు. తాను చట్టానికి అతీతుడిని అని చంద్రబాబు ఎపుడూ అనుకుంటారని ఆయన ఎద్దేవా చేశారు. అయితే ఈ కేసులో ఒకరి విజయం మరొకరి పరాజయం అన్నది లేదు అని సజ్జల అన్నారు. ఈ విషయంలో మరొకరు తప్పు చేయకూడదు అన్నదే జగన్ ప్రభుత్వం కేసులో నిరూపించిందని అన్నారు.

చంద్రబాబు కోర్టుల పరిధిని ఐటీ పరిధిఈ సీబీఐ పరిధిని తానే నిర్ణయిస్తారా అని ఆయన మండిపడ్డారు. తన మీద వచ్చిన కేసులో తప్పు లేకపోతే కోర్టులో చెప్పుకోవచ్చు కదా అని ఆయన అన్నారు. చంద్రబాబు నిజాయతీపరుడు అయితే కాదని అన్నారు. అందుకే ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక అవినీతి పరమైన పనులు చేశారని సజ్జల ఆరోపించారు.

ఈ కేసులో కూడా అలాగే చేద్దామని అనుకున్నా బలమైన ఆధారాలు ఉండబట్టే బాబుకు జైలుకు పోవాల్సి వచ్చిందని సజ్జల అంటున్నారు. ప్రభుత్వానికి ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం కక్ష అన్నది ఉండదని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని అన్నారు. అడ్డగోలు పనులు చేయాలనుకునే వారికి తగిన విధంగా చర్యలు ఉండాలని ఆయన అన్నారు.

ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి బాబుకు ఉపశమనం అన్నది ఎలా లభిస్తుంది అన్నది చూడాలని సజ్జల అన్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో బాబు అరెస్ట్ సంచలనం రేపితే ఇపుడు రిమాండ్ కి తరలించడం మరో సంచలనంగా మారుతోంది.

Tags:    

Similar News