సజ్జల ధర్మాగ్రహం.. ఇప్పుడే ఎందుకు పడిపోతున్నారో?!
సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు హామీలు ఇచ్చారని అన్నారు.
వైసీపీ నాయకుడు, గత జగన్ సర్కారు సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు కూటమి సర్కారుపై తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ విమర్శలకు అర్థం పర్థం లేదనే వాదన రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి పట్టుమని మూడు శుక్రవారాలు కూడా ఎందుకీ విమర్శలంటూ.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నా రు. కొందరు పరుష పదాలతో వ్యాఖ్యలు చేస్తున్నారు. పథకాలను ఎగ్గొట్టేందుకు..చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలపై మండి పడుతున్నారు. సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు హామీలు ఇచ్చారని అన్నారు.
అంతేకాదు.. ఇప్పుడు వాటిని ఎగ్గొట్టేందుకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారంటూ..చంద్రబాబుపై సజ్జల మండిపడ్డారు. ముఖ్యం గా అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది ఉంటే.. అంత మంది పిల్లలకూ రూ.15 వేల చొప్పున ఇస్తానన్న చంద్రబాబు ఆహామీని ఇప్పటికీనెరవేర్చలేదన్నారు. ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు ఆ ఊసే లేకుండా వ్యవహరిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ముఖ్యంగా మహిళలకు 18 ఏళ్లు దాటిని వారికి రూ.1500 చొప్పున నెల నెలా ఇస్తానన్న చంద్రబాబు మాట ఏమైందని నిలదీశారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
సజ్జల మాట్లాడేదేమైనా ఆయనకు అర్థం అవుతోందా? అని ప్రశ్నిస్తున్నారు. ఖజానాను నాకించేసి.. ఇప్పుడు నీతులు చెబుతు న్నారా? అని కొందరు ప్రశ్నిస్తే.. సంపద సృష్టించే వరకు కూడా ఆగలేక పోతున్నారా? అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇకొందరు మీలాగా అప్పులు చేసి పథకాలు అమలు చేసే పరిస్థితి సీబీఎన్‌కు ఉండదని, ఆయన సంపద సృష్టించిన తర్వాత.. ఇస్తారని.. మీకెందుకు నొప్పి అని వ్యాఖ్యానించారు. చాలా మంది అయితే.. అసలు ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు! అంటూ.. తీవ్రంగా నిప్పులు చెరిగారు. ఎక్కువ మంది సీబీఎన్ కు అంతా తెలుసు.. ఎప్పుడు అమలు చేయాలో ఆయన చేస్తారులే.. మీరు రెస్టు తీసుకోండి.. అని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇక, సజ్జల మరో మాట కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరు మాసాల ముందు నుంచే చంద్రబాబుకు తెలుసునని, అందుకే తాము ఆయన స్థాయిలో ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించలేదన్నారు. అన్నీ ఆలోచించే ప్రజలకు తాము మేనిఫెస్టోలో హామీలు వండివార్చామన్నారు. కానీ, చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు లేనిపోని హామీలను గుప్పించారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపైనా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పరిస్థితి ఇంతే! ఇలానే ఏడవండి!! అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరి దీనిపై వైసీపీ నాయకులు ఏమంటారో చూడాలి.