కాంగ్రెస్ బ్యాచ్ ని శైలజానాధ్ తీసుకొస్తారా ?
వైసీపీలో కాంగ్రెస్ నుంచి చేరిన వారు మాజీ పీసీసీ చీఫ్ మాజీ మంత్రి సాకె శైలజానాధ్. ఆయన మెడలో వైసీపీ కండువా కప్పి సాదరంగా జగన్ ఆహ్వానించారు.
వైసీపీలో కాంగ్రెస్ నుంచి చేరిన వారు మాజీ పీసీసీ చీఫ్ మాజీ మంత్రి సాకె శైలజానాధ్. ఆయన మెడలో వైసీపీ కండువా కప్పి సాదరంగా జగన్ ఆహ్వానించారు. ఇక శైలజానాధ్ వైసీపీ సీనియర్ నేతగా పలు వెబ్ చానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆయన వైసీపీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏపీలో ఎన్డీయే వ్యతిరేక భావజాలం ఉండి తీరాల్సిందే అంటున్నారు బీజేపీ యాంటీ భావజాలం కలిగిన వారు తప్పకుండా వైసీపీని బలపరుస్తారని అంటున్నారు. ఏపీలో రాజకీయాన్ని కేవలం వైసీపీకి 11 సీట్లు వచ్చాయనో నేతలు పార్టీ నుంచి పోతున్నారనో లెక్క వేయకూడని అంటున్నారు.
రెండు బలమైన సిద్ధాంతాల మధ్య పోరుగానే చూడాలని అన్నారు. ఎండీయే కూటమి ఏపీలో అధికారంలో ఉందని దాని వ్యతిరేక కూటమిగా వైసీపీ ఉందని అన్నారు. ఈ భావజాలాన్ని బలపరచేవారు కూడా అత్యధిక శాతం ఉన్నారని అన్నారు. మరో వైపు చూస్తే రాష్ట్రంలో రాజకీయం నిలువునా చీలిపోయింది అని అన్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ భావజాలం అంతా వైసీపీలో ఉన్నపుడు కాంగ్రెస్ లోని నాయకులు అంతా ఈ క్లిష్ట సమయంలో ఎన్డీయే వ్యతిరేక శిబిరానికి వచ్చి బలపరచాల్సి ఉందని అన్నారు తాను అయితే వైసీపీలో చేరి పనిచేయాలని అనుకున్నానని అన్నారు. మిగిలిన కాంగ్రెస్ నాయకులు అంతా కూడా రావాలన్నది జనం కోరిక ఉందని అన్నారు.
ఇక తాను వెళ్ళి మాట్లాడి పిలిచేటంత సీనియర్ ని కానని అన్నారు. తమ జిల్లాకు చెందిన రఘువీరారెడ్డి తమకు రాజకీయంగా గురువు లాంటి వారు అని అన్నారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు వైఎస్సార్ తో కలసి పనిచేశారని అన్నారు. ఈ విధంగా సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నది వారికే బాగా తెలుసు అన్నారు.
తాను మాత్రం తన అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలో వైసీపీ పటిష్టతకు కృషి చేస్తాను అని అన్నారు. అంతే కాదు జగన్ తనకు ఏ విధమైన బాధ్యత అప్పగించినా చేస్తాను అని అన్నారు ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వానికి ఆపోజిట్ పాలిటిక్స్ అంటే మాత్రం వైసీపీయే సరైన వేదిక అని శైలజనాధ్ చెప్పారు.
మొత్తానికి చూస్తే శైలజనాధ్ తారువాత చాలా మంది కాంగ్రెస్ నేతల పేర్లు వినిపించాయి. మాజీ ఎంపీ హర్షకుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, అలాగే రఘువీరారెడ్డి సహా ఇతర కీలక నేతలు అంతా పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. మరి శైలజనాధ్ అయితే తానుగా వైసీపీలో చేరాను అని చెప్పారు దాంతో కాంగ్రెస్ సీనియర్లతో సంప్రదింపులు జరిపి వైసీపీలోకి తెచ్చే బాధ్యతను ఆయన తన భుజానికి ఎత్తుకోవడం లేదని అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ నాయకులు అంతా వైసీపీలో చేరాలన్నది బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని గెలిపించాలన్నది జనం కోరిక అని శైలజా నాధ్ అంటున్నారు. మరి ఆ విధంగా ఏపీ పాలిటిక్స్ మారుతుందా అన్నది చూడాల్సి ఉంది.