ఆలస్యంగా బయటకు.. నడిరోడ్డు మీద మహిళపై స్పా ఓనర్ దాష్టీకం

మహిళ మీద దాడి చేసిన వ్యక్తిని అహ్మదాబాద్ లోని గెలాక్సీ స్పా యజమాని మొహ్సిన్ గా గుర్తించారు. దాడికి గురైన మహిళ.. అతడి బిజినెస్ పార్టనర్ గా తేల్చారు

Update: 2023-09-29 05:09 GMT

కారణం ఏమైనా కానీ.. హద్దులు దాటేసే వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. తాజాగా స్పా యజమాని ఒకరు చేసిన దుర్మార్గం సీసీ కెమేరాలో రికార్డు కావటమే కాదు.. కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చి వైరల్ గా మారింది. గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన నాలుగు నిమిషాల వీడియోను చూస్తే షాక్ కు గురి కావాల్సిందే. ఏం తప్పు చేసినా.. అలా రోడ్డు మీద దాడి చేయటం.. బట్టలు చించేయటం లాంటి తీరును తీవ్రంగా పరిగణించాల్సిందే. ఈ ఎపిసోడ్ లో దారుణ విషయం ఏమంటే.. స్పా యజమానితో ఉన్న వ్యక్తి ఒకరు కాస్తంత అడ్డుకునే ప్రయత్నం చేసినా.. చివరకు అతడు చేస్తున్న దురాగతాన్ని చూస్తుండిపోయారు.

మహిళ మీద దాడి చేసిన వ్యక్తిని అహ్మదాబాద్ లోని గెలాక్సీ స్పా యజమాని మొహ్సిన్ గా గుర్తించారు. దాడికి గురైన మహిళ.. అతడి బిజినెస్ పార్టనర్ గా తేల్చారు. వారిద్దరి మధ్య గొడవ జరిగి.. వాగ్వాదం వేళ.. ఆ మహిళ చెంపను ఛెళ్లుమనిపించగా.. ఆమె సైతం అంతే ఆగ్రహంతో సమాధానం ఇచ్చింది. అనంతరం అతగాడి పశుబలం ముందు ఆమె ఆగలేకపోయింది.

ఆమెను దారుణంగా కొడుతూ.. ఆమె దుస్తుల్ని చించేశాడు.ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పరిగెత్తుకుంటూ వెల్లి.. జుట్టు పట్టి లాగి వెనక్కి తీసుకురావటమే కాదు.. పదే పదే దాడి చేసిన వైనం సీసీ పుటేజ్ లో కనిపిస్తుంది. ఇదంతా చూసిన ఒక సామాజిక కార్యకర్త బోడక్ దేవ్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు వెంటనే స్పందించి.. ఆమెను రక్షించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపినట్లుగా తెలుస్తోంది.

ఈ ఉదంతంపై రెండు రోజుల పాటు కంప్లైంట్ ఇవ్వని సదరు మహిళ.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. బిజినెస్ లో వచ్చిన విభేదాలతోనే ఈ దారుణానికి తెగబడినట్లుగా చెబుతున్నారు. స్పా యజమాని మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. స్పా యజమాని తప్పించుకొని అండర గ్రౌండ్ కు వెళ్లిపోయాడు. అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

Tags:    

Similar News