'చైనా శత్రువు కాదు'... కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మొదలైన దుమారం!
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడాపై విరుచుకుపడుతున్నారు.
భారత్ - చైనా మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే! బోర్డర్ లో చైనా సైన్యం కవ్వింపు చర్యలు.. ముందుకు దూసుకు వచ్చే పనుల నడుమ భారత్ తో ఆ దేశానికి సమస్యలు చాలానే ఉన్నట్లు చెబుతారు. అయితే.. చైనా విషయంలో భారత్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.
అవును... చైనాను భారతదేశం శత్రువులా చూడొద్దని.. చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని.. ఆ దేశాన్ని గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందని.. భారత్ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని.. తొలి నుంచి చైనాతో అనుసరిస్తున్న వైఖరి ఇరు దేశాల మధ్య శత్రుతాన్ని పెంచుతోందని సూచించారు శామ్ పిట్రోడా.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడాపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చైనా పట్ల ఉన్న వ్యామోహానికి మూలకారణం 2008లో చైనీస్ కమ్యునిస్ట్ పార్టీ (సీసీపీ) తో కాంగ్రెస్ పార్టీకి కుదిరిన అవగాహన ఒప్పందం అని భారతీయ జనతా పార్టీ పేర్కొంది.
మన భూమిలో 40,000 చదరపు కిలోమీటర్లను చైనాకు వదులుకున్న వారికి ఇప్పటీకీ డ్రాగన్ నుంచి ఎలాంటి ముప్పు కనిపించడం లేదు.. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీ.ఆర్.ఐ) ప్రకటించడానికి ఒకరోజు ముందు కాంగ్రెస్ చేసిన ఈ వ్యాఖ్యల్లో రహస్యం దాగి ఉందని బీజేపీ జాతీయ ప్రతినిధి తుహిన్ సిన్హా తెలిపారు.
ఇదే సమయంలో... రాహుల్ గాంధీ కుడిభుజం అయిన శామ్ పిట్రోడా.. చైనా మన శత్రువు కాదని చెబుతూ ఆ దేశంపై అంతులేని ప్రశంసలు కురిపిస్తున్నారని.. వీరికి ఎల్లప్పుడూ చైనా, పాకిస్థాన్ ప్రయోజనాలకంటే ఎక్కువగా ఉంచడం వెర్రితనమని మరో బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఆరోపించారు.