పార్లమెంటును కాదని..'సంభాల్'కు.. ఏంటీ రచ్చ!
ఒకవైపు పార్లమెంటు జరుగుతోంది. శీతాకాల సమావేశాల్లో అనేక అంశాలపై చర్చించాల్సి కూడాఉంది.
ఒకవైపు పార్లమెంటు జరుగుతోంది. శీతాకాల సమావేశాల్లో అనేక అంశాలపై చర్చించాల్సి కూడాఉంది. అయినప్పటికీ.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సహా.. మరికొన్ని ప్రతిపక్షాలకు ఉత్తరప్రదేశ్‌లోని `సంభాల్` కీల కంగా మారిపోయింది. పార్లమెంటు సమావేశాలను సైతం డుమ్మా కొట్టివారు.. సంభాల్‌కు చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ-యూపీ సరిహద్దు రహదారులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో రెండు కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఏంటీ విషయం?
యూపీలోని సంభాల్ జిల్లాలో మొఘలుల పరిపాలనా కాలంలో షాహి అనే మొగల్ పాలకుడు జామా మసీదును నిర్మించారు. ఇది తర్వాత కాలంలో ప్రఖ్యాతి కూడా చెందింది. కొన్ని తరాలుగా ఇక్కడి వారు మసీదుకు కూడా వెళ్తున్నారు. దాదాపు శతాబ్దానికి పూర్వం నుంచి ఎలాంటి వివాదాలు, విభేదాలు కూడా రాకుండా ఈ వ్యవహారం ముందుకు సాగుతోంది. అయితే.. ఇటీవల ఓ మహిళ(ఆర్ ఎస్ ఎస్ సానుభూతి పరురాలనే చర్చ ఉంది) జామా మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో హరిహర మందిరం ఉండేదని.. అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇది మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత.. కొందరు ఆమెకు సపోర్టుగా ముందుకు వచ్చారు. దీంతో స్థానిక కోర్టును ఆమె ఆశ్రయించారు. జామా మసీదు ఉన్న ప్రాంతంలో సర్వే చేయించాలని.. హరిహర మందిరం ఉండేదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో స్థానిక కోర్టు వెంటనే పురావస్తు శాఖను సర్వేకు ఆదేశించింది. ఇక, ఈ ఆదేశాలపై.. స్థానికంగా భారీ ఎత్తున రచ్చ రేగింది. ముస్లిం మైనారిటీ వర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. సర్వే కోసం వచ్చిన వారిని తరిమి తరిమి కొట్టారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులకు దిగారు.
మొత్తంగా.. అటు ఇటు ఇరు వర్గాలు కూడా.. ఘర్షణకు దిగడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కట్ చేస్తే.. ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. యూపీలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వ్యూహాత్మకంగానే.. ఈ వివాదాన్ని రాజేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక, యూపీ ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ కూడా.. నిప్పులు చెరుగుతోంది. ఇండియా కూటమిలో తాము ఉండాలంటే.. కాంగ్రెస్ పార్టీ కలిసి రావాలని షరతు విధించింది.
దీంతో పార్లమెంటు సమావేశాలను కూడా పట్టనపెట్టి.. రాహుల్ గాంధీ, తాజాగా పార్లమెంటుకు ఎన్నికైన ప్రియాంక గాంధీలు.. సంభాల్‌కు బయలు దేరారు. మరోవైపు సీఎం యోగి మాత్రం వీరిని సంభాల్‌కు అడుగు కూడా పెట్టనివ్వద్దని అధికారులకు ఆదేశాలు జారీచేశారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో సంభాల్ ఇప్పుడు మత పరమైన..రాజకీయ పరమైన రచ్చకు దారితీయడం గమనార్హం. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.