బాలినేని సామినేనిలకు జనసేన ఆఫర్లు అవేనా ?

వైసీపీ నుంచి జనసేన వైపు వెళ్ళిన ఇద్దరు సీనియర్ నాయకులకు జనసేన నుంచి భారీ ఆఫర్లే దక్కినట్లుగా ప్రచారం సాగుతోంది.

Update: 2024-09-20 03:40 GMT

వైసీపీ నుంచి జనసేన వైపు వెళ్ళిన ఇద్దరు సీనియర్ నాయకులకు జనసేన నుంచి భారీ ఆఫర్లే దక్కినట్లుగా ప్రచారం సాగుతోంది. జనసేనలో ఈ సీనియర్ల గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

జనసేన పార్టీ విస్తరణతో పాటు కీలకమైన సామాజిక వర్గాలను బలమైన నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకునే వ్యూహాన్ని పవన్ అనుసరిస్తున్నారు. వైసీపీలో ఇమడలేని నాయకులు అలాగని టీడీపీలోనికి నేరుగా పోలేని వారు అంతా జనసేన వైపు వస్తున్నారు.

అలా వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు పవన్ కళ్యాణ్. జనసేన టీడీపీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయిదేళ్ళ కూటమి పాలనలో అధికారం చేతిలో ఉంటుంది. దాంతో పాటు అనేక పదవులు అవకాశాలు ఉంటాయి.

ఇలా ఆలోచించే చాలా మంది నేతలు జనసేనను ఎంచుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి వెళ్ళిపోయారు అని అంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన వైఎస్సార్ జగన్ హయాంలో మంత్రిగా రెండు సార్లు పనిచేశారు.

ఆయన వైసీపీని వీడి జనసేనకు జై కొట్టారు. అలాగే మరో కీలక నేత, క్రిష్ణా జిల్లా జగ్గంపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా జనసేనలో చేరుతున్నారు. ఈయన కూడా మెగా కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరు పొందారు. వైఎస్సార్ హయాంలో జగన్ హయాంలో ఎమ్మెల్యే గా ప్రభుత్వ విప్ గా పనిచేసిన ఉదయభాను కు మంత్రి పదవి జగన్ విస్తరణలో కూడా ఇవ్వలేదు అన్న అసంతృప్తి ఉంది.

మొత్తానికి బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉదయభాను జనసేన ను ఎంచుకున్నారు. ఈ ఇద్దరు నేతలకు తగిన గౌరవ మర్యాదలు జనసేనలో లభిస్తాయని హామీ దక్కిందని చెబుతున్నారు. ఈ ఇద్దరికీ శాసన మండలిలో ఎమ్మెల్సీ పదవులు కన్ ఫర్మ్ అయ్యాయని చెబుతున్నారు.

దాంతో పాటు పార్టీ పరంగా కూడా పెద్ద పీట వేస్తారని అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు ఉదయభానును జనసేన అధ్యక్షుడిగా చేయవచ్చు అని ప్రచారం సాగుతోంది. అదే విధంగా బాలినేనికి కూడా పార్టీ పరంగా కీలక స్థానం దక్కుతుదని అంటున్నారు.

పవన్ తో భేటీ తరువాత బాలినేని మీడియా ముందు ఉత్సాహంగానే కనిపించారు. జగన్ మీద గతంలో లేని విధంగా విమర్శలు చేశారు. తాను చేసిన త్యాగాలకు వైసీపీలో విలువ లేకుండా పోయింది అని ఆవేదన చెందారు. ఇది వైసీపీ మీద బాలినేని విమర్శలకు ఆరంభం మాత్రమే అని అంటున్నారు. రానున్న రోజులలో మరిన్ని చేస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా జనసేనలో వైసీపీ కీలక నేతలుగా ఈ ఇద్దరే కాదు మరింతమంది చేరుతారు అని టాక్ నడుస్తోంది. అందులో గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News