చంద్రబాబు ఏ2 గా మరో కేసు... ఏపీఎండీసీ కీలక ఫిర్యాదు!
అవును... ఈమధ్య చంద్రబాబుపై మద్యం అక్రమాల కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇవాళ తాజాగా ఇసుక అక్రమాల కేసు నమోదు చేసింది! ఇందులో చంద్రబాబును ఏ2గా చేర్చింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల అనారోగ్య కారణాలతో ఆయనకు నెలరోజుల పాటు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పై హైదరాబాద్ లోని నివాసంలో ఉన్నారు.
ఈ క్రమంలో నవంబర్ 28న సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది! ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క ఫైబర్ నెట్ లో అవినీతి జరిగిందని, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో క్విడ్ ప్రోకో జరిగిందని, అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో అవకతవకలు జరిగాయని, అంగళ్లులో పోలీసులపై దాడులు చేశారని, మద్యం స్కాం కేసు ఇప్పటికే నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో కేసు నమోదైంది.
అవును... ఈమధ్య చంద్రబాబుపై మద్యం అక్రమాల కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇవాళ తాజాగా ఇసుక అక్రమాల కేసు నమోదు చేసింది! ఇందులో చంద్రబాబును ఏ2గా చేర్చింది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ధ ఏపీ ఎండీసీ సీఐడీకి ఫిర్యాదు చేసింది. దీంతో సీఐడీ వెంటనే చంద్రబాబుతో పాటు ఆయన హయాంలో పనిచేసిన మంత్రులు, పలువురు టీడీపీ నేతలపై ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇందులో భాగంగా... ఈ తాజా ఎఫ్ఐఆర్ లో ఏ-1 గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమను పేర్కొన్నారు. వీరంతా తమ చర్యల ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్రస్థాయిలో నష్టం చేకూర్చారని ఏపీ ఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. దీంతో... మద్యం కేసు తరహాలోనే ఇసుక అక్రమాల కేసులోనూ ముందస్తు బెయిల్ కు వెళతారా అన్నది ఇప్పుడు తెరపైకి వచ్చింది.
కాగా... చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే! చంద్రబాబు.. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా కూడా పట్టించుకోలేదని సీఐడీ తెలిపింది. ఇదే సమయంలో... 2016-19 మధ్య అక్రమ మైనింగ్ కు వివిధ కేసుల్లో 40 కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు. ఈ విషయాన్ని సీఐడీ ఎఫ్ఐఆర్ లో పొందుపర్చింది. దీంతో... ఈ కేసు ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందనేది వేచి చూడాలి!