విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆసక్తికరమైన జవాబిచ్చిన మంత్రి!
ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉభయ సభల్లోనూ మణిపూర్ ఘటనలపై చర్చకు అన్ని విపక్షాలు పట్టుబడుతుండటం.. సభలో గందరగోలం నెలకొంటుండటం జరుగుతుంది. ఈ సమయంలో ఎగువ సభలో కీలక అంశాలపైనే చర్చ నడుస్తోంది!
ఇందులో భాగంగా... రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్రాన్ని ఒక కీలక ప్రశ్న అడిగారు. సాగరమాల ప్రాజెక్ట్ కింద ఏపీలో కేంద్రం చేపట్టిన పనులు, విడుదల చేసిన నిధులు, ఇప్పటివరకూ పెట్టిన ఖర్చు, పూర్తిచేసిన పనుల వివరాలను తెలపాలని అడిగారు.
అయితే విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ లిఖిత పూరకంగా సమాధానం ఇచ్చారు. సాగరమాల ప్రాజెక్ట్ కింద ప్రస్తుతం ఉన్న పోర్టులు.. టెర్మినల్స్.. టూరిజం జెట్టీల ఆధునీకరణ.. పోర్టుల కనెక్టివిటీ, విస్తరణ.. ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి.. స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రాజక్టులు చేపడుతున్నట్లు వివరించారు.
ఇదే సమయంలో విశాఖ పోర్ట్ అథారిటీ, జాతీయ రహదారుల అథారిటీ, పబ్లిక్ వర్క్స్, రైల్వేలు, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. వంటివి ఇంప్లిమెంటింగ్ ఏజన్సీలుగా వ్యవహరిస్తున్నట్లు సొనొవాల్ తెలిపారు. ఇదే సమయంలో స్టేట్ మారిటైం బోర్డులు, మేజర్ పోర్టులు, పబ్లిక్ రంగం ప్రైవేటు భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ సమన్వయంతో ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
దీనికోసం సాగరమాల ప్రాజెక్ట్ కింద ఏపీలో 1,20,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా మొత్తంగా 113 ప్రాజెక్టులను చేపట్టినట్లు పేర్కొంది. వీటిలో 36,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపింది.
ఇదే సమయంలో మిగిలిన వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని వివరించిన కేంద్ర మంత్రి... ఇందులో భాగంగా పోర్టుల ఆధునీకరణ, కనెక్టివిటీ పెంపు, పరిశ్రమల అభివృద్ధి, కోస్తా తీర ప్రాంతాల అభివృద్ధి.. వంటి 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. అదేవిధంగా... 77 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
అనంతరం... పనులు అవిరామంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి ఆటంకాలు ఉండట్లేదని, నిర్ణీత గడువులోగా పూర్తవుతాయని అంచనా వేస్తోన్నామని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు.