బాబు పట్టించుకోలేదు.. పైగా నోటీసులు!
తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీరు రోజురోజుకీ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన కసరత్తులు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. ఇంఛార్జీలను నియమిస్తూ సాగుతున్నారు.
ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి ఆయనకు తలనొప్పిగా మారింది. నేతల మధ్య విభేదాలను పరిష్కరించడంలో బాబు విఫలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
సత్తెనపల్లి పార్టీ ఇంఛార్జీగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను బాబు ప్రకటించారు. అయితే ఇప్పటికే అక్కడ మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు.
ఇప్పుడు లక్ష్మీనారాయణను ఇంఛార్జీగా నియమించడంతో శివరామ్ వర్గం పార్టీపై అసంతృప్తితో ఉంది. దీంతో పార్టీ కార్యక్రమాలకు శివరామ్ వర్గం దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదంటూ శివరామ్ అనుచరులు 16 మందికి టీడీపీ అధిష్ఠానం నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది.
దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు నోటీసులు ఇస్తారా? అని ఆ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం శ్రమిస్తే బాబు నుంచి చక్కటి బహుమతి అందిందని అసహనంతో ఉన్నారు.
గతంలో లక్ష్మీనారాయణ వల్ల కేసులతో ఇబ్బందులు పడ్డామని శివరామ్ వర్గం చెబుతోంది. ఇదే విషయమై బాబును కలిసేందుకు శివరామ్ ప్రయత్నిస్తే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని సమాచారం. నోటీసులు అందుకున్న నాయకులతో బాబు ఫోన్లో మాట్లాడతారని ప్రచారం జరిగినా.. అది నిజం కాలేదు. దీంతో శివరామ్ వర్గం తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతోంది.