ఎన్టీఆర్ కుటుంబీకురాలు అంటూ ఆమె ప్రస్తావన తెచ్చిన మంత్రి !

ఏపీ అసెంబ్లీలో పరోక్షంగా ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతి ప్రస్తావనను తెచ్చి మంత్రి కొంత ఆసక్తిని రేపారు

Update: 2024-07-24 14:02 GMT

ఏపీ అసెంబ్లీలో పరోక్షంగా ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతి ప్రస్తావనను తెచ్చి మంత్రి కొంత ఆసక్తిని రేపారు. ఆ సమయంలో చంద్రబాబు సైతం ఆలోచిస్తూ ఉన్నట్లుగా కనిపించారు. ఇదంతా ఎలా జరిగింది అంటే ఎన్టీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయం పేరుని ఆయనకే తిరిగి పెడుతూ సభలో వైద్య ఆరోగ్య శాఖల మంత్రి సత్యకుమార్ యాదవ్ బిల్లు ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పేరుతో ఉన్న విశ్వవిద్యాలయం పేరుని మారుస్తున్నపుడు వైసీపీలో ఉన్న ఆయన కుటుంబీకులు నోరు అయినా మెదపకపోవడం ఆశ్చర్యం అని అన్నారు. వైసీపీ మోచేతి నీళ్ళు తాగుతూ వారు మౌనంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికీ వారు వైసీపీలోనే కొనసాగుతున్నారని పరోక్షంగా లక్ష్మీ పార్వతి ప్రస్తావన తెచ్చారు.

తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఎన్టీఆర్ పేరుని వాడుకునే వారు ఆయన పేరుని మారుస్తూంటే కనీసంగా కూడా నిరసన తెలియ చేయకపోవడం దారుణం అని సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఈ మాటలు అంటున్నపుడు టీడీపీ సభ్యులు అంతా ఏదీ అర్థం కాక మొదట అయోమయంలో పడ్డారు. ఎందుకంటే ఎన్టీఆర్ పేరుని మారుస్తూంటే సొంత కుటుంబీకులే నిరసన తెలియ చేయలేదు అని మంత్రి మొదట అన్నారు. దాంతో టీడీపీ సభ్యులు కొంత ఇబ్బంది పడ్డట్లుగా కనిపించారు.

దాంతో ఎవరా వారు అని అంతా అయోమయం పడ్డారు. ఎందుకంటే ఎన్టీఆర్ కుటుంబం అంతా ఆనాడు మీడియా ముందుకు వచ్చి నిరసన తెలిపింది. అయితే ఆ తరువాత మంత్రి ఈ డౌట్ ని క్లియర్ చేస్తూ వారుఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారని తాను పేరు చెప్పను అంటూ ఇండైరెక్ట్ గా లక్ష్మీపార్వతి మీద సెటైర్లు వేశారు.

అయితే ఇది బాగానే ఉన్నా ఈ రోజుకీ లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా అంగీకరించేందుకు ఆ కుటుంబం వారు ఇష్టపడడం లేదు అన్న సంగతి ప్రచారంలో ఉంది. అయితే విమర్శించాలి అన్న దాంట్లో సత్యకుమార్ యాదవ్ ఈ లాజిక్ మిస్ అయ్యారా అని కూడా చర్చ సాగుతోంది. ఇక లక్ష్మీపార్వతి ప్రస్తావన తెచ్చినపుడు ఆమె ఎన్టీఆర్ కుటుంబీకురాలు అని మంత్రి చెబుతున్నపుడు చంద్రబాబు ఏ భావం ముఖంలో కనిపించకుండా అలా చూస్తూ ఉండిపోయారు.

మరో వైపు చూస్తే మంత్రి ఇంకో విషయం కూడా సభలో బయట పెట్టారు. అసలు ఎన్టీఆర్ పేరు ఆ వర్శిటీకి పెట్టిందే డాక్టర్ వైఎస్సార్ అని చెప్పడం జరిగింది. తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెట్టి ఒక ఆదర్శవంతమైన రాజకీయం చేశారని జగన్ మాత్రం దాన్ని తీసేశారు అని దుయ్యబెట్టారు. ఈ సమయంలో క్రెడిట్ వైఎస్సార్ కి ఇవ్వడం పట్ల కూడా సభలో కొంత ఆసక్తిని రేపు లాగానే కనిపించింది.

ఈ పేరు మార్పు వల్ల విద్యార్ధులు ఇతర చోట్ల అడ్మిషన్లు రాక ఇబ్బందులు పడ్డారని మంత్రి అన్నారు. అసలు ఇది ఏ రకంగా ఔచిత్యం తో కూడుకున్న నిర్ణయమో వైసీపీ పెద్దలకే తెలియాలి అని చురకలు వేశారు. అంతే కాదు వైసీపీకి ఎన్టీఆర్ ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా కనిపించి ఉండవచ్చునని కానీ ఆయన అందరి వాడు అని మంత్రి కీర్తించారు. అంతే కాదు ఆయన బడుగు బలహీన వర్గాలకు చెందిన నేత అని ఆయన వల్లనే ఈ రోజు తన లాంటి వారు మంత్రులు అయ్యారని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ పేరు మార్చడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని కూడా అన్నారు.

Tags:    

Similar News