బీఆర్ఎస్ ఓవర్ లోడ్ అయిపోయిందా ?

టికెట్లు రాదని తెలిసినా సీనియర్లు కాంగ్రెస్ కు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ లో చేరటమే విచిత్రంగా ఉంది.

Update: 2023-10-31 17:30 GMT

కొందరు సీనియర్ నేతల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. టికెట్లు రాదని తెలిసినా కాంగ్రెస్ కు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారంటే టికెట్లు రాలేదన్న అసంతృప్తితో రాజీనామాలు చేస్తున్నారని అనుకోవచ్చు. మరి వీళ్ళు బీఆర్ఎస్ లో ఎందుకు చేరుతున్నట్లు ? బీఆర్ఎస్ లో చేరినంత మాత్రాన వీళ్ళకు టికెట్లు వచ్చేదిలేదు. ఎందుకంటే అన్నీ నియోజకవర్గాల్లోను కేసీయార్ అభ్యర్థులను ప్రకటించేశారు.

ఇపుడు చేరుతున్న సీనియర్ల కోసం అభ్యర్ధులను మార్చే అవకాశం ఎంతమాత్రం లేదు. టికెట్లు రాదని తెలిసినా సీనియర్లు కాంగ్రెస్ కు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ లో చేరటమే విచిత్రంగా ఉంది. కనీసం బీజేపీలో చేరినా టికెట్ దక్కే అవకాశముంది. ఎందుకంటే బీజేపీ ఇంకా ప్రకటించాల్సిన అభ్యర్ధుల జాబితా చాలానే ఉంది. పొన్నాల లక్ష్మయ్య, చెరుకు సుధాకర్, నాగం జనార్ధనరెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి, విష్ణు వర్ధనరెడ్డి లాంటి వాళ్ళని చూసి ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు ఆశ్చర్యపోతున్నారు.

గతంలో పార్టీలో చేరిన వాళ్ళకే అప్పట్లో ఇచ్చిన హామీలను కేసీయార్ ఇంతవరకు నెరవేర్చలేదట. అలాంటిది ఇపుడు ఇంతమంది కొత్తగా ఎందుకు చేరుతున్నారో ఎవరికీ అర్ధంకావటంలేదు. పైగా చేరేముందు ఎలాంటి హామీలను అందుకుంటున్నారో కూడా తెలీటంలేదు. మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాల మద్దతు లేకపోతే గెలుపు సాధ్యంకాదని కేసీయార్ కు అర్ధమైంది. అందుకనే వాళ్ళతో చర్చలు జురిపి మద్దతు తీసుకున్నారు. కమ్యూనిస్టులు కూడా కష్టపడి బీఆర్ఎస్ అబ్యర్ధిని గెలిపించారు. అవసరం తీరిపోయిన తర్వాత వామపక్షాలను అవతల పాడేశారు.

ఈ విషయం అందరి కళ్ళముందు జరిగిందే. అంటే అవసరానికి కేసీయార్ ఎలాంటి హామీలను ఇవ్వటానికి కూడా వెనకాడరన్నది అర్ధమవుతోంది. అవసరం తీరిపోయినా లేదా అవసరం ఉండదని అనుకున్నా పార్టీలనైనా, నేతలనైనా మళ్ళీ దగ్గరకు కూడా చేర్చరు. ఇపుడు చేరుతున్న సీనియర్ల వ్యవహారం కూడా తమకు లాగే తయారవుతుందని ఇదివరకే చేరిన కొందరు సీనియర్లు చెబుతున్నారు. తమకన్నా ముందు పార్టీలో చేరిన వాళ్ళ పరిస్ధితిని తెలిసి కూడా చేరుతున్నారంటే ఎలాంటి హామీలు అందుకుంటున్నారో ఏమో చూడాలి.

Tags:    

Similar News