సర్వేలతో అయోమయం పెరిగిపోతోందా ?
షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడే కొద్ది జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే పలురకాల సర్వేలు చక్కర్లు కొడుతుండటమే
షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడే కొద్ది జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే పలురకాల సర్వేలు చక్కర్లు కొడుతుండటమే. ఇందులో పార్టీలు దేనికదే సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నాయి. దీనికి అదనంగా మీడియా సంస్ధలు, సర్వే సంస్ధలు కూడా విడివిడిగా సర్వేలు చేస్తుండటమే. అన్నీ సర్వేల ఫలితల పేరుతో ప్రచారంలోకి వస్తుండటంతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పార్టీలు చేయించుకున్న సర్వేలతో మీడియా, సర్వే సంస్ధలు చేస్తున్న సర్వే ఫలితాలకు బాగా తేడా ఉంటోంది.
అన్నీ సర్వేల ఫలితాలు జనాల్లోకి వచ్చేస్తుండటంతో ఏది నిజమో అర్ధంకాక, దేన్ని నమ్మాలో తెలీక జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈరోజు కేంద్ర ఎన్నికల కమీషన్ మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలోనే ఐదురాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందని అనుకుంటున్నారు. షెడ్యూల్ గనుక ప్రకటిస్తే సర్వే సంస్ధల జోరు, ప్రభావం మరింతగా పెరిగిపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ తప్ప ఇంకేపార్టీ అభ్యర్ధులను ప్రకటించలేదు.
పార్టీల గెలుపోటములు అభ్యర్ధుల మీదకూడా ఆధారపడుంటుందని అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన సర్వేలన్నీ పార్టీల ప్రభావం మీద జరిగినవే. ఇకనుండి పార్టీలతో పాటు అభ్యర్ధుల గుణగణాలను దృష్టిలో పెట్టుకుని కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పటివరకు వచ్చిన సర్వేల ఫలితాలు వేరు ఇకముందు రాబోయే సర్వేల ఫలితాలు వేరని అర్ధంచేసుకోవాలి. ఇప్పటి నుండి పోటీ చేయబోతున్న అభ్యర్ధుల కూడా సొంతంగా సర్వేలు చేయించుకుంటారు. కాబట్టి జనాల్లో అయోమయం మరింతగా పెరిగిపోవటం ఖాయం.
గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ప్రముఖ సంస్ధలే సర్వేల పేరుతో ఫలితాలను విడుదల చేశాయి. ఇందులో కొన్నింటి సర్వేలు మాత్రమే ఫలితాలకు దగ్గరగా వచ్చాయి. కాబట్టి సర్వేలన్నీ నిజాలవుతాయనే గ్యారెంటీ ఏమీలేదు. ఏ పార్టీ తరపున సైడ్ తీసుకోకుండా నిజాయితీగా, శాస్త్రీయంగా జరిపిన సర్వేలు జనాభిప్రాయానికి కాస్త దగ్గరగా ఉండే అవకాశాలున్నాయి. సర్వే ఫలితాల పేరుతో జనాల మైండ్ సెట్ మార్చాలని పార్టీలు దేనికదే ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడే సమస్యలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.