'సీమా' మాకు అక్కర్లేదు.. ఆమె పిల్లలు ఓకే

జైలు నుంచి బయటకు వచ్చిన సీమా

Update: 2023-07-17 04:17 GMT

ఆన్ లైన్ ప్రేమ అనూహ్య మలుపులు తిరిగిన వైనం తెలిసిందే. పాకిస్థాన్ కు చెందిన ముప్ఫై ఏళ్ల సీమా హైదర్ కు భారత్ కు చెందిన పాతికేళ్ల సచిన్ మీరాకు మధ్య పరిచయం కావటం.. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లి.. అక్రమంగా దేశంలోకి ఎంట్రీ ఇవ్వటం వరకు తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో నలుగురు పిల్లల తల్లి అయిన సీమా.. ఇంట్లో వారికి చెప్పకుండా రహస్యంగా ఇంటి నుంచి బయటకు వచ్చి.. దుబాయ్ కు ఆ తర్వాత నేపాల్ కు చేరుకుంది.

సచిన్ సైతం నేపాల్ వెళ్లి.. అక్కడ ఇరువురు పెళ్లి చేసుకొని అక్రమంగా గ్రేటర్ నొయిడా ప్రాంతంలోని రబుపురాలో నివిస్తున్నారు. వీరి ఉదంతం గురించి తెలుసుకున్న పోలీసులు సీమాను అరెస్టు చేయటం.. ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్ ను సైతం అరెస్టు చేసి జైలుకు పంపారు. నలుగురు పిల్లల్ని మాత్రం సంరక్షణ నిలయంలో ఉంచారు. ఇటీవల వీరిద్దరికి బెయిల్ లభించింది.

జైలు నుంచి బయటకు వచ్చిన సీమా మాట్లాడుతూ.. తాను పాకిస్థాన్ కు తిరిగి వెళ్లేది లేదని.. తాను హిందువుగా ఉంటానని.. భారత్ లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సీమా కుటుంబీకులు స్పందించారు.

ఆమెను ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్ లోకి అనుమతించేది లేదని చెబుతున్నారు. అయితే.. ఆమె నలుగురు పిల్లల్ని మాత్రం పాక్ కు అనుమతిస్తామన్నారు. సీమా ఇప్పుడు ముస్లిం కాదని.. ఆమె నలుగురు పిల్లల్ని పాక్ కు పంపేసి.. ఆమె భారత్ లోనే ఉండాలంటున్నారు.

ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ లోకి అనుమతించేది లేదంటున్న కుటుంబ సభ్యుల మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రెండు వర్గాల వారు ఎవరికి వారు తమ అభిప్రాయాల్ని చెప్పేస్తున్నారు.

మరి.. సీమాకు భారత్ లో ఉండేందుకు అనుమతి లభిస్తుందా? అధికారులు మంజూరు చేస్తారా? అన్నది ప్రశ్న. మరి.. నలుగురు పిల్లల్ని కూడా సీమా వదిలేసి.. తాను ప్రేమించిన వాడితో ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాజా ఎపిసోడ్ కు సంబంధించి సీమా వెర్షన్ బయటకు రావాల్సి ఉంది.

Tags:    

Similar News