ఒకరు క్రికెట్ లో.. మరొకరు సినిమాల్లో.. పన్ను చెల్లింపులో 'కింగ్' లు

షారూక్, విజయ్ కంటే వెనుకే పన్ను చెల్లింపులో తోటి క్రికెటర్లను ఎక్కడో ఉంచిన కోహ్లి.. సినీ స్టార్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ ను మాత్రం అధిగమించలేకపోయారు.

Update: 2024-09-05 08:02 GMT

సరిగ్గా 18 ఏళ్ల కిందట అతడో ఓ యువ క్రికెటర్.. తండ్రిని కోల్పోయిన దు:ఖంలోనూ మ్యాచ్ ఆడి జట్టును ఓటమి నుంచి తప్పించిన బ్యాట్స్ మన్.. సరిగ్గా 16 ఏళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్లో అతడో అనామకుడు.. సరిగ్గా 10 ఏళ్ల కిందట ప్రతిభావంతుడైన సగటు క్రికెటర్.. మరిప్పుడు రికార్డులన్నీ అతడికి దాసోహం.. ఎవరికీ అందనంత ఎత్తున కీర్తి.. యువ క్రికెటర్లు ఫిట్ నెస్ ఐకాన్.. కెరీర్ ల ఎదగాలనే వారికి ఓ స్ఫూర్తి మంత్రం.. అన్నిటికి మించి భారత దేశంలో అత్యంత అధిక పన్ను చెల్లించిన క్రీడాకారుడు..

అతడి కంటే డబుల్..

భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ అత్యధిక పాపులారిటీ ఉన్న క్రికెటర్ ఎవరంటే..? మరో మాట లేకుండా వినిపించే పేరు విరాట్ కోహ్లి. కేవలం 18 ఏళ్ల వయసుకే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి 16 ఏళ్లుగా అప్రతిహతంగా సాగిపోతోంది అతడి ప్రయాణం. మధ్యలో ఎన్నో ఒడిదొడుకులు.. జట్టులో చోటు కోల్పోయి.. ఫామ్ పడిపోయినా మళ్లీ పుంజుకొని టాప్ క్రికెటర్ గా ఎదిగాడు. ఇప్పుడు పన్ను చెల్లింపులోనూ టాపర్ గానే నిలిచాడు. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో విరాట్ కట్టిన పన్ను రూ.66 కోట్లు అని వెల్లడైంది. ప్లేయర్లందరిలోనూ ఇదే అత్యధికం కావడం విశేషం. అయితే, మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ (రూ.38 కోట్లు), సచిన్ టెండూల్కర్‌ (రూ.28 కోట్లు), సౌరభ్‌ గంగూలీ (రూ.23 కోట్లు) కంటే కోహ్లి చాలా ఎక్కువ పన్ను చెల్లించడం గమనార్హం. ధోని కంటే దాదాపు డబుల్ ట్యాక్స్ పే చేశాడు. ఇక ఆల్‌ రౌండర్‌ హార్దిక్ పాండ్యా రూ.13 కోట్లు పన్ను చెల్లించాడట. ఈ వివరాలను ఫార్చ్యూన్‌ ఇండియా రిపోర్టు బయటపెట్టింది.

షారూక్, విజయ్ కంటే వెనుకే పన్ను చెల్లింపులో తోటి క్రికెటర్లను ఎక్కడో ఉంచిన కోహ్లి.. సినీ స్టార్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ ను మాత్రం అధిగమించలేకపోయారు. గత ఆర్థిక సంవత్సరంలో షారూక్‌ రూ.92 కోట్లు ట్యాక్స్‌ చెల్లించాడని ఫార్చ్యూన్ ఇండియా తెలిపింది. ఈ మొత్తం కోహ్లి కంటే రూ. 28 కోట్లు ఎక్కువ. మరోవైపు తమిళ సూపర్ స్టార్ విజయ్‌ (రూ.80 కోట్లు), బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు), బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ (రూ.71 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మొత్తం మీద కోహ్లికి ఐదో స్థానం దక్కింది. అయితే, ఆశ్చర్యకరంగా అజయ్‌ దేవగణ్‌ (రూ.42 కోట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ధోనీ, రణబీర్‌ కపూర్‌ (రూ.36 కోట్లు), హృతిక్‌ రోషన్‌, సచిన్‌ నిలిచారు.

కోహ్లి వేల కోటీశ్వరుడు సాధారణ మధ్య తరగతి నేపథ్యం నుంచి పట్టుదలతో ఎదిగిన కోహ్లి ప్రస్తుత ఆస్తి విలువ రూ. వేలకోట్లలోనే ఉంటుంది. బీసీసీఐ కాంట్రాక్టుల్లో కొన్నేళ్లుగా ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగుతున్న అతడు దీనికి ఏటా బీసీసీఐ నుంచి రూ.7 కోట్లు పొందుతున్నాడు. మ్యాచ్ ఫీజులు దీనికి టిప్ లాంటివి. ఐపీఎల్‌ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడే కోహ్లి రూ.15 కోట్లు తీసుకుంటున్నాడు. పలు టాప్ బ్రాండ్లకు అంబాసిడర్ కూడా. ఒక్కో యాడ్ కే రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్లు వసూలు చేస్తాడు. ఇక సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ కింగ్ కోహ్లినే అని చెప్పొచ్చు. ఒక పోస్టు పెడితే కొన్ని కోట్లు తీసుకుంటున్నాడు.

Tags:    

Similar News