ఆ మేటి ఆల్ రౌండర్.. రాజకీయ నాయకుడిగా

మైదానంలో ఎప్పుడూ క్రికెట్ జెర్సీలో కనిపించే షకిబ్ తాజాగా.. కుర్తా, పైజామా, పైన కోటు వేసి రాజకీయ నాయకుడిగా మారిపోయారు

Update: 2023-11-26 11:48 GMT

ప్రపంచంలోనే మేటి ఆల్ రౌండర్లుగా ఆ ఆటగాడు గుర్తింపు పొందారు. బ్యాటింగ్, బౌలింగ్లో సత్తాచాటుతూ తన జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. ఇప్పుడు తమ దేశ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరిస్తున్నారు. ఇటీవల వన్డే ప్రపంచకప్ లోనూ జట్టును నడిపించారు. ఇప్పుడిక ఈ క్రికెటర్.. మరో మైదానంలో ఆటాడేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. రాజకీయ మ్యాచ్ లో ఆల్ రౌండర్ పాత్ర పోషించేందుకు రెడీ అయ్యారు. ఆయనే.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్. ఈ ఆటగాడు రాజకీయ అరంగేట్రం చేయడం ఖాయమైంది.

మైదానంలో ఎప్పుడూ క్రికెట్ జెర్సీలో కనిపించే షకిబ్ తాజాగా.. కుర్తా, పైజామా, పైన కోటు వేసి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ఇప్పుడు షకిబ్ పొలిటికల్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ఆరంభించేందుకు సిద్ధమైన షకిబ్..అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని తెలిసింది. బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ తరపున ఆయన రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మగురా పార్లమెంట్ నుంచి ఎంపీగా షకిబ్ పోటీ చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే పార్టీ అధినేత్రి, బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా నుంచి నామినేషన్ పత్రాలనూ షకిబ్ స్వీకరించారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా నిర్వహించిన సమావేశానికి రాజకీయ నాయకుడి లుక్ లో షకిబ్ హాజరయ్యారు. అయితే క్రికెట్లో కొనసాగుతూనే షకిబ్ రాజకీయాల్లో సాగుతారా? లేదా ఆటకు వీడ్కోలు పలుకుతారా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. షకిబ్ ఇప్పటివరకూ బంగ్లాదేశ్ తరపున 66 టెస్టులు, 247 వన్డేలు, 117 టీ20లు ఆడారు.

Tags:    

Similar News