పాక్ తో మ్యాచ్ లో క్రీజులో క్రికెటర్.. స్వదేశంలో అతడిపై హత్య కేసు

అవన్నీ సమసిపోయి.. ఈ ఏడాది బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఎంపీగానూ ఎన్నికయ్యాడు షకిబుల్.

Update: 2024-08-23 11:41 GMT

ప్రస్తుతం బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం పాకిస్థాన్ లో పర్యటిస్తోంది. ఈ జట్టులో షకిబుల్ హసన్ కీలక ఆల్ రౌండర్. 17 ఏళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్నాడు. ప్రతిభావంతుడైన క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో అతడిపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. గ్రౌండ్ లో అభిమానులను దూషించడం, కొట్టడం వీటిలో ఉన్నాయి. అత్యంత కీలక దశలో గొప్ప ఫామ్ లో ఉండగా ఓ ఏడాది పాటు ఐసీసీ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అవన్నీ సమసిపోయి.. ఈ ఏడాది బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఎంపీగానూ ఎన్నికయ్యాడు షకిబుల్. కానీ.. అతడి భవిష్యత్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది.

మన్నించినట్లే మన్నించి

జూలైలో, ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లలో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ వచ్చేశారు. హసీనా వెళ్లిపోయాక.. ఆ దేశ అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే షకిబ్ సభ్యత్వం రద్దయింది. కాగా, అల్లర్లలో రూబెల్‌ అనే యువకుడు చనిపోగా.. షేక్ హసీనా ప్రభుత్వమే దీనికి కారణమంటూ అతడి తండ్రి రఫీకుల్‌ ఇస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా హసీనా సహా 154 మందిపై హత్య కేసు నమోదైంది. ఇందులో షకిబ్‌ 28వ నిందితుడు. కాగా, బంగ్లాదేశ్ లో ప్రముఖ నటుడు అయిన ఫెర్దూస్‌ అహ్మద్‌ ను 55వ నిందితుడిగా పేర్కొన్నారు. వీరిద్దరూ హసీనా పార్టీ అవామీ లీగ్‌ తరఫున ఎంపీలుగా ఎన్నికయిన వారు కావడం గమనార్హం. అయితే, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం షకిబ్ ను మ్యాచ్ లు ఆడేందుకు అనుమతించింది.

కెనడా నుంచి పాక్ కు..

బంగ్లాలో అల్లర్లు జరుగుతున్న సమయంలో షకిబ్ కెనడాలో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. అక్కడినుంచే నేరుగా పాకిస్థాన్ వెళ్లాడు. ప్రస్తుతం టెస్టు సిరీస్‌ లో ఆడుతున్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీశాడు. 15 పరుగులు చేశాడు. సోషల్‌ మీడియాలో తరచూ పోస్ట్ లు చేసే షకిబ్.. బంగ్లా అల్లర్లపై మౌనం వహించాడు. అల్లర్లలో మరణాలకు.. ఓ ఎంపీగా అతడూ బాధ్యుడే అని, మౌనం వీడాలని కామెంట్లు వచ్చాయి. స్వదేశానికి వచ్చి వివరణ ఇవ్వాలనే డిమాండ్లు వినిపించాయి. ఇవన్నీ అలా ఉండగానే హత్య కేసు నమోదవడం గమనార్హం.

Tags:    

Similar News