రాజకీయాల్లోకి మహ్మద్ షమి.. అక్కడి నుంచే పోటీ!
గౌతమ్ గంభీర్ బీజేపీ ఎంపీగా ఉండగా, మనోజ్ తివారి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, మనోజ్ తివారి తదితరులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గౌతమ్ గంభీర్ బీజేపీ ఎంపీగా ఉండగా, మనోజ్ తివారి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరికొంతమంది క్రీడాకారులు రాజకీయ అరంగేట్రం చేస్తారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో భారత బౌలింగ్ తురుపుముక్క మహ్మద్ షమి పేరు గట్టిగా వినిపిస్తోంది.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మహ్మద్ షమిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది. షమిని పశ్చిమ బెంగాల్ లోని బసిర్ హత్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీకి దింపాలని బీజేపీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖాలీ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు హింసాకాండకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ గ్రామం సమీపంలోనే ఉన్న బసిర్ హత్ లోక్ సభా నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. షమీని బరిలోకి దించితే మైనార్టీ ఓట్లను కొల్లగొట్టొచ్చని బీజేపీ విశ్వసిస్తోంది.
పశ్చిమ బెంగాల్ లో రాబోయే లోక్ సభ ఎన్నికలకు షమీని అభ్యర్థిగా ప్రతిపాదించారని.. దీనిపై చర్చలు సానుకూలంగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. షమీని రంగంలోకి దింపడం వల్ల పశ్చిమ బెంగాల్ లో మైనారిటీల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ వర్గాల నుంచి అధిక ఓట్లను సాధించవచ్చని బీజేపీ విశ్వసిస్తోంది.
బీజేపీ ఇప్పటికే తన ప్రతిపాదనను షమీకి తెలిపిందని.. అయితే ఇంకా అతడు నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. కాగా షమీ దేశవాళీ క్రికెట్ తోపాటు, రంజీ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్ కు ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.
కాగా ప్రస్తుతం.. మహ్మద్ షమీ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా వన్డే ప్రపంచకప్ లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన షమీ ఏడు మ్యాచ్ ల్లో 24 వికెట్లు తీసి దుమ్ములేపాడు. ఏడు మ్యాచ్ ల్లో 10.70 సగటు, 12.20 స్ట్రైక్ రేట్ తో సంచలన ప్రదర్శన చేశాడు. భారత్ వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ చేరడంలో షమీ ముఖ్యపాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్ లో ఓడిపోయిన తర్వాత ప్రధాని మోదీ ఆటగాళ్లందరినీ వ్యక్తిగతంగా కలుసుకుని వారిని ఓదార్చారు. టోర్నీలో మహ్మద్ షమీ సంచలన ప్రదర్శన చేశాడని కొనియాడుతూ అతడిని ప్రధాని కౌగిలించుకోవడం విశేషం. క్రికెట్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లోని ఆ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది.
మరోవైపు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ షమీ సమావేశమయ్యారు. ఇంకోవైపు షమీ స్వగ్రామమైన ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహాలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.