శరద్‌ పవార్‌ కొత్త పార్టీ ఇదే... పేరులోనూ "శరద్"

అవును... మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి

Update: 2024-02-07 18:03 GMT

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలోని శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆయనది కాకుండాపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో గత కొన్ని నెలలుగా నెలకొన్న వివాదానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక పరిష్కారం చూపించింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఈ సమయంలో శరద్ పవార్ కొత్త పార్టీని ప్రకటించారు.

అవును... మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ పవార్ వర్గానికే ఎన్సీపీ పార్టీ పేరు, గుర్తు కేటాయించింది ఎన్నికల కమిషన్. దీంతో... ఎన్నికల కమిషన్ తాజా నిర్ణయంపై అజిత్ పవార్ వర్గం హర్షం వ్యక్తం చేసింది. మరోపక్క సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ శరద్ పవార్ వర్గం ప్రకటించింది.

ఈ క్రమంలో శరద్‌ పవార్‌ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా... కొత్త పార్టీ పేరును ఖరారు చేసింది. ఈ క్రమంలో... "నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ - శరద్‌ చంద్ర పవార్‌" పార్టీగా నామకరణం చేసింది. దీంతో మహారాష్ట్రలో మరో కీలకమైన కొత్త పార్టీ పురుడుపోసుకున్నట్లయ్యింది. త్వరలోనే మహారాష్ట్రలోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ.. కొత్త పేరు, గుర్తులను ఎంచుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో... మూడు పేర్లు, ఎన్నికల గుర్తులను శరద్ పవార్‌ వర్గం ఈసీ ఆమోదం కోసం పంపింది. వీటిలో "నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ - శరద్‌ చంద్ర పవార్‌", "నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ - శరద్‌ రావు పవార్‌", " నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ - శరద్‌ పవార్‌" పేర్లు పంపించింది. అయితే... ఈ మూడింటిలోనూ " నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ - శరద్‌ చంద్ర పవార్‌" పేరును ఫైనల్ చేస్తూ ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. అలాగే టీ కప్పు, పొద్దుతిరుగుడు పువ్వు, ఉదయించే సూర్యుడు గుర్తులు పరిశీలించాలని ఈసీని కోరినట్లు శరద్‌ పవార్‌ వర్గం పేర్కొంది.

కాగా... గతేడాది ఎన్సీపీ నుంచి చీలి బీజేపీ - శిండే సారథ్యంలోని ప్రభుత్వంలో అజిత్‌ పవార్‌ చేరడంతో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్సీపీ ఎవరిది అనే విషయంలో నెలకొన్న వివాదాన్ని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. ఈ క్రమంలోనే అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించి.. ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తును కూడా వారికే కేటాయించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్‌ వర్గం చీలిక తర్వాత శరద్‌ పవార్‌ వెంట 12మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News