పేర్ని నానికి షర్మిల పవర్ ఫుల్ పంచ్!

ఈ నేపథ్యంలో నానికి శుక్రవారం షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని అంటున్నారు!

Update: 2024-10-25 10:55 GMT

వైఎస్ జగన్ - షర్మిల మధ్య ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని గురువారం మీడియా ముందు స్పందించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నానికి శుక్రవారం షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని అంటున్నారు!

అవును... ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తి వివాదం తీవ్ర సంచలనంగా మారిన వేళ పేర్ని నాని స్పందించారు. ఇందులో భాగంగా... జగన్ ఫ్యామిలీ వ్యవహారంపై వాస్తవాలు పట్టించుకోకుండా ఎల్లో మీడియా, కూటమి నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా... వైఎస్ మరణం కంటే ముందే జగన్, షర్మిలలకు ఆస్తి పంచారని.. వ్యాపారాల్లో వచ్చే ఆదాయంతో జగన్ మరిన్ని కంపెనీలు స్థాపించారని నాని తెలిపారు. ఒకసారి ఆస్తి పంపకాలు అయిపోయిన తర్వాత.. పెళ్లైన ఇన్నేళ్లకు కూడా ఏ అన్న అయినా తన ఆస్తులు పంచుతారా అని ప్రశ్నించారు!

భారతీ సిమెంట్స్ లో షర్మిలకు జగన్ 40 శాతం రాసిచ్చారని ఈ సందర్భంగా పేర్ని నాని గుర్తు చేశారు. ఈడీ కేసుల్లో జగన్ కు బెయిల్ రద్దు కావడం కోసమే శత్రువులతో షర్మిల చేతులు కలిపి పనిచేస్తున్నారని ఆరోపిస్తూ.. షర్మిల వంటి చెల్లెలు ఉంటే ఏ అన్నకైనా సమస్యలు తప్పవని అన్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ అభిమానులను ఉద్దేశించి షర్మిల తాజాగా ముడు పేజీల బహిరంగ లేఖ రాశారు. ఇందులో పేర్కొన్న కొన్ని అంశాలు, ఇచ్చిన వివరణలు, లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తే... గురువారం పేర్ని నాని ప్రెస్ మీట్ లో లేవనెత్తిన అంశాలకు ఆన్సర్ వచ్చేసిందని, చేసిన కామెంట్లకు పంచ్ పడిందని అంటున్నారు!

ఇందులో భాగంగా... ఒక్క సండూరు మినహాయించి.. సరస్వతి, సాక్షి మీడియా, భారతీ సిమెంట్స్, యలహంక ప్రాపర్టీ, క్లాసిక్ రియాలిటీ వ్యాపారాలన్నీ వైఎస్సార్ బ్రతికి ఉండగా స్థాపించినవి అని.. అందులో నలుగురు బిడ్డలకూ సమాన వాటా ఉండాలనేది వైఎస్సార్ మేండేట్ అని షర్మిల తెలిపారు.

ఇక తాను జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... తాను జగన్ కి ఓ లేఖ రాస్తే.. అది ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ అయితే.. నాకు ఏమి సంబంధం అని షర్మిల ప్రశించారు. తానైతే బైబిల్ పై ప్రమాణం చేస్తానని.. నా వరకూ నేను గానీ, నా మనుషులు గానీ బయటపెట్టలేదని నొక్కి చెప్పారు.

ఇదే సమయంలో... చంద్రబాబుతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే షర్మిల ఎందుకు నోరు మెదపడం లేదని.. పైపెచ్చు అధికారంలో లేని జగన్ పై ఎందుకు విమర్శలు చేస్తున్నారని నాని ప్రశ్నించారు. ఈ సమయంలో తాజా లేఖలో... చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్సార్ బిడ్డకు లేదని షర్మిల పేర్కొన్నారు.

దీంతో... గురువారం ప్రెస్ మీట్ లో పేర్ని నాని లేవనెత్తిన మెజారిటీ ప్రశ్నలకు సమాధానాలు, కామెంట్లకు పంచ్ లు శుక్రవారం షర్మిల రాసిన లేఖలో పడినట్లేననే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News