ఒట్టేసి మరీ జగనన్నను ఒదలనంటున్న షర్మిలమ్మ

అయితే షర్మిల మాత్రం ఈ ఇష్యూని జగన్ ని ఏ మాత్రం ఒదిలిపెట్టడం లేదు.

Update: 2024-11-29 09:40 GMT

జగన్ కి టీడీపీ జనసేన బీజేపీ కూటమి కంటే ఎక్కువగా కాంగ్రెస్ నుంచి అది కూడా పీసీసీ చీఫ్ షర్మిల నుంచే ఎటాక్ కనిపిస్తోంది. జగన్ మీద అదానీ నుంచి ముడుపులు తీసుకున్నారు అన్న ఆరోపణలు ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు చేశాయి. అయితే షర్మిల మాత్రం ఈ ఇష్యూని జగన్ ని ఏ మాత్రం ఒదిలిపెట్టడం లేదు.

విజయవాడలో పాదయాత్ర చేశారు, గవర్నర్ ని కలసి మరీ జగన్ ఆనాడు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయమని డిమాండ్ చేశారు. ఇక అదానీ ముడుపులు తీసుకోలేదని జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలని రెండు రోజుల క్రితం డిమాండ్ చేసిన షర్మిల జగన్ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి మరీ అదానీ నుంచి ముడుపులు తీసుకోలేదని క్లారిఫికేషన్ ఇచ్చినా వదలేట్టు లేరు అంటున్నారు

ఈసారి ఆమె బైబిల్ మీద జగన్ ని ప్రమాణం చేయమని కొత్త డిమాండ్ పెట్టారు. అదానీ నుంచి ముడుపులు తీసుకోకపోతే బైబిల్ మీద ఒట్టేసి చెప్పరాదా జగనన్నా అంటూ పొడవాటి ట్వీటేసి మరీ రెచ్చగొడుతున్నారు

అంతేనా జగన్ కి అబద్ధాలు అందంగా ఆడడంతో ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కూడా చెల్లెమ్మ ఎకసెక్కమాడారు. తాను చేసిన మంచి పనికి జగన్ శాలువాలు సన్మానాలు అవార్డులు అందుకునే ముందు తాను వేసే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.

సెకీ నుంచి కారు చవకగా విద్యుతు ని ఏపీకి కొనుగోలు చేశామని చెప్పిన జగన్ 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, ఏపీకి రూ 2.49 పైసలకు కొన్నందుకు శాలువలు కప్పాలా అని సూటిగా ప్రశ్నించారు. అదే అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొంటేఅదే కంపెనీ నుంచి 50పైసలు ఎక్కువ పెట్టి, రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా జగన్ననా అని ప్రశ్నతో గుచ్చేసారు

ఇక అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుండా ఉంటే ఏపీలో జగన్ ఆగమేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు అవార్డులు ఇవ్వాలా అని నిలదీశారు. ఇక ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు.

అంతే కాదు రూ.2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు జగన్ అని ఆమె గద్దించారు. ఇక ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్ఠంగా యూనిట్ రూ.1.70 పైసలు పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా జగనన్నా అని లాజిక్ పాయింట్ నే తీశారు.

ఇక అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ లో నాపేరు ఎక్కడుందని బుకాయించే జగన్ కి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు తమరు కారా అని చెల్లెమ్మ నిలదీశారు. మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదు. అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు అని ఆమె గుర్తు చేశారు. ఎఫ్బీఐ, ఎసీసీ వంటి సంస్థలు జరిగిన అవినీతి మీద స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని షర్మిల గుర్తు ఏశారు

నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే బైబిల్ మీద ప్రమాణం చేయండని షర్మిల సవాల్ చేశారు. . దమ్ముంటే జగన్మోహన్ ఈ సవాల్‌ను స్వీకరించాలని అని షర్మిల ట్వీట్ చేశారు. మొత్తానికి షర్మిల ఏపీలో ఏ రాజకీయ పక్షం ఇవ్వనంత స్ట్రాంగ్ డోస్ ని జగన్ కి ఇచ్చేశారు. మరి చెల్లెమ్మ ఒట్టు సవాల్ ని జగన్ స్వీకరిస్తారా లేక గట్టు మీద తీసి పెడతారా అనంది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News