టీడీపీ మీద షర్మిల ధర్నా...అందుకోసమేనా ?
విద్యుత్ చార్జీలు పెంచారు అంటూ ఆమె చేసిన ధర్నా విషయంలో రాజకీయ విశ్లేషణలు భిన్నంగా ఉన్నాయి.
వైసీపీని ఏ రాజకీయ పార్టీ ద్వేషించ నంతగా ద్వేషిస్తూ తన రాజకీయాన్ని కొనసాగిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మొత్తానికి టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ధర్నా కార్యక్రమం ఒకటి నిర్వహించారు. విద్యుత్ చార్జీలు పెంచారు అంటూ ఆమె చేసిన ధర్నా విషయంలో రాజకీయ విశ్లేషణలు భిన్నంగా ఉన్నాయి.
షర్మిల ఏపీలో టీడీపీ కూటమి అయిదు నెలల పాలన మీద తమలపాకుతో కొట్టినట్లుగా ఒకటి రెండు ముక్కలు మాట్లాడుతూ ఓడిపోయిన వైసీపీ మీదనే తన ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఏపీలో గత అయిదు నెలలలో ఏమి జరిగినా గత వైసీపీ ప్రభుత్వం పాలనలో వైఫల్యాలు అంటూ ముడి పెట్టి జగన్ కే అంటగడుతున్నారు అన్న విమర్శలు వచ్చాయి.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో నిర్వహించిన ధర్నా మీద కూడా రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీనే పదే పదే ఆమె విమర్శిస్తున్నారు అని మచ్చ అయితే ఆ పార్టీ మీద షర్మిల నాయకత్వం మీద పడింది. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కావాలీ అంటే అధికార కూటమికి వ్యతిరేకంగా పనిచేయాలని అంతే తప్ప వైసీపీ మీద విమర్శలు ఏమిటి విచిత్రంగా అని అంతా అనుకున్నారు.
మరో వైపు చూస్తే విద్యుత్ చార్జీలు భారీగా పెంచేసారు అని షర్మిల చేసిన ఈ ధర్నాలో సైతం గత వైసీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ విమర్శలు సంధించడం విశేషం. వైసీపీ తన ప్రభుత్వ హయాంలో మొత్తం తొమ్మిది సార్లు 35 వేల కోట్ల రూపాయలు విద్యుతు చార్జీలు పెంచిందని చంద్రబాబు అన్నారని ఆమె పేర్కొన్నారు. ఇపుడు అదే చంద్రబాబు ఏపీలో తన హయాంలో కేవలం నాలుగు నెలల్లోనే 6 వేల కోట్ల రూపాయలు పెంచారని ఆమె విమర్శించారు.
సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదని ఆమె ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జనాలకు బాదుడే అని ఆమె అన్నారు. మొత్తానికి షర్మిల అయితే టీడీపీ కూటమికి మరీ ముఖ్యంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. అయితే ఈ ధర్నా అంతా ఒక రాజకీయ ప్రహసనంగానే అంటున్న వారూ ఉన్నారు.
నిజానికి వైసీపీని జగన్ ని పనిగట్టుకుని విమర్శించడమే షర్మిల పనిగా పెట్టుకున్నారని కూడా అంతా అంటూ వచ్చారు. ఆమె టీడీపీతో అవగాహనతో పెట్టుకునే ఈ విధంగా సొంత సోదరుడి మీద ఘాటు విమర్శలు చేశారు అని కూడా అంతా అంటున్న నేపధ్యం ఉంది. మరి ఆ మచ్చను తొలగించుకోవడానికి అన్నట్లుగా పీసీసీ నాయకత్వంలో చేసిన ఈ ధర్నా అయితే పెద్దగా చర్చకు రావడం లేదు అని అంటున్నారు.
విద్యుత్ చార్జీలు పెంచడం వరకూ కూటమి చేసినా లాంతర్లు పట్టుకుని ధర్నా చేయడం పూర్తిగా ఓల్డ్ ట్రెండ్ అని అంటున్నారు. ఈ రోజులలో లాంతర్లు ఎక్కడ ఉన్నాయని కూడా అంటున్నారు. ఎంత విద్యుత్ చార్జీలు పెరిగినా జనాలు లాంతర్లు వేసుకుంటున్నారా అని కూడా అంటున్నారు.
ఏది ఏమైనా షర్మిల ఏపీ రాజకీయంలో ఇది కొత్త విషయమే అని అంటున్నారు. టీడీపీని తమలపాకుతో కొట్టినట్లుగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత షర్మిల వైఖరిని జనాలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు అనే అంటున్నారు. ఆమె ఎంత చంద్రబాబుకు యాంటీగా ఆందోళనలు చేసినా ఆమె జగన్ తో ఎందుకు విభేదించారో ఆస్తుల వివాదాలు అన్నీ కూడా బయటకు వచ్చేశాయి, వాటి మీద ప్రజలకు ఒక క్లారిటీ అయితే ఉందని అంటున్నారు. దాంతో పాటుగా ఏపీలో కాంగ్రెస్ కూడా ఉనికి పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ ధర్నాలు ఏవీ పెద్దగా జనాలకు ఆనేవి కావని అంటున్నారు.