అన్నా నీవూ నేనూ ఒకటేనన్నా !
ఎందుకంటే కాంగ్రెస్ కి ఏపీ అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు లేరు.
అవును జగన్ సోదరి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇపుడు అదే అంటున్నారు. నీవూ నేనూ ఒక్కటే అని ఆమె అనడం వెనక అర్ధాలు ఏంటి అంటే ఏపీలో పెద్దగా లేని కాంగ్రెస్ తో వైసీపీని పోల్చారు అన్న మాట. ఏపీలో దాదాపుగా నలభై శాతం ఓట్లు తెచ్చుకుని పదకొండు మంది ఎమ్మెల్యేలు, నలుగురు లోక్ సభ ఎంపీలు ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 30కి పైగా ఎమ్మెల్సీలు ఉన్న వైసీ కూడా తమతో సమానమే అని ఆమె అంటున్నారు.
ఎందుకంటే కాంగ్రెస్ కి ఏపీ అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు లేరు. అందుకే వారు అసెంబ్లీకి వెళ్లే చాన్స్ లేదు, కానీ వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఇంట్లోనే కూర్చుంటున్నారు అని షర్మిల ఎద్దేవా చేశారు. అపుడు మీకూ మాకూ తేడా ఏముంది, ఇద్దరం ఒక్కటే కదా అన్నా అని ఆమె జగన్ మీద పవర్ ఫుల్ సెటైర్ పేల్చారు. మరో వైపు చూస్తే జగన్ తాజా ప్రెస్ మీట్ పెట్టినపుడు మీడియా ప్రతినిధులు షర్మిల కామెంట్స్ గురించి ప్రస్తావించారు.
కాంగ్రెస్ కి ఏపీలో 1.77 ఓటు షేర్ మాత్రమే ఉందని ఆ పార్టీ గురించి ఎందుకు అన్నట్లుగా జగన్ మాట్లాడారని ప్రచారం జరిగింది. దానికి కౌంటర్ ఇస్తూ విజయవాడలో ప్రెస్ మీట్ లో షర్మిల జగన్ వైఖరి మీద మండిపడ్డారు.
ఏపీలో అయిదేళ్ల జగన్ ప్రభుత్వం అరాచకాలను భరించలేక ప్రజలు ఆ పార్టీకి 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా పూర్తిగా పోయింది, కనీసం అసెంబ్లీకి వెళ్ళి ప్రజా పక్షంగా అయినా నిరూపించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు
ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదని అన్నారు. రాష్ట్ర సమస్యలను పక్కన పెడితే కనీసం పులివెందుల సమస్యలు అయినా అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరముందని ఆమె అన్నారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చుని మాట్లాడానికి కాదని ఆమె ఎద్దేవా చేశారు.
వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయాలని కూడా షర్మిల డిమాండ్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ కి ఓటింగ్ షేర్ తక్కువని కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వమే లేదన్న వైసీపీ తన పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా ఇప్పించి ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు.
ఇక శాసనసభకు వెళ్లనప్పుడు హస్తం పార్టీకి, వైసీపీకి పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారు క్షమాపణలు చెప్పినా వదలకూడదన్నారు. పోస్టులు పెట్టేవారి అరెస్టుల్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాలని షర్మిల కోరారు. మొత్తానికి జగన్ ని ఆమె అసలు వదలడం లేదు. టీడీపీతో పాటుగా ఇంకా చెప్పాలంటే ఎక్కువగానే టార్గెట్ చేస్తున్నారు. మరి దీనిని వైసీపీ నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.