రెండూ ఒక్కటి కాదంటూ జగన్ కి షర్మిల షాక్!

ఏపీలో కూడా ప్రజలు వైసీపీని గెలిపించాలి అనుకుంటే కూటమి గెలిచింది అని ఆయన చెప్పినట్లు అయింది.

Update: 2024-10-18 03:44 GMT

ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు అయింది. అక్కడ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారు అని కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక హర్యానా ఫలితాల మీద వైసీపీ అధినేత జగన్ సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ ఏపీలో జరిగిన మాదిరిగానే హర్యానాలో కూడా జరిగింది అని పోలిక తెచ్చారు.

ఏపీలో కూడా ప్రజలు వైసీపీని గెలిపించాలి అనుకుంటే కూటమి గెలిచింది అని ఆయన చెప్పినట్లు అయింది. ఈవీఎంల మీదనే అనుమానాలు వ్యక్తం చేస్తూ మళ్లీ బ్యాలెట్ విధానం రావాలని కూడా జగన్ డిమాండ్ చేశారు. ఒక విధంగా కాంగ్రెస్ కి నైతిక మద్దతు ఇచ్చేలా జగన్ స్టేట్మెంట్ ఉంది.

అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన గొంతు విప్పినట్లు అయింది. ఇండియా కూటమి నేతల నుంచే స్ట్రాంగ్ సపోర్ట్ కాంగ్రెస్ కి హర్యానా ఫలితాల తరువాత రాని నేపథ్యంలో జగన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఒక విధంగా బూస్ట్ ఇచ్చినట్లే అనుకోవాలి. అయితే కాంగ్రెస్ జాతీయ నేతలు జగన్ స్టేట్మెంట్ ని ఎలా పరిగణిస్తున్నారో తెలియదు కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు జగన్ కి స్వయాన చెల్లెలు అయిన షర్మిల మాత్రం జగన్ స్టేట్మెంట్ నే తప్పు పట్టారు.

హర్యానా ఏపీ రెండూ ఒక్కటి కావు అని ఆమె తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు. హర్యానాలో అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చి చెప్పాయని కానీ ఫలితాలు వేరేగా వచ్చాయని అందుకే కాంగ్రెస్ అక్కడ పోరాడుతోందని అన్నారు. ఏపీలో అయితే కేవలం వైసీపీ చేయించుకున్న సొంత సర్వేలు తప్ప మిగిలినవి అన్నీ కూడా కూటమి గెలుస్తుందనే వచ్చాయని ఆమె తేడా ఎత్తి చూపారు

జగన్ ఓటమిని జనాలే రాశారు తప్ప ఈవీఎంల భ్రమలు వద్దు అని ఆమె చెప్పినట్లు అయింది. బీజేపీని ఒక వైపు తప్పు పడుతూ కాంగ్రెస్ కి నైతిక మద్దతు జగన్ ఇచ్చినా కూడా చెల్లెమ్మ మాత్రం జగన్ నే కార్నర్ చేయడం విశేషం. పైగా ఏపీలో వైసీపీ ఓటమి ఎపుడో ఖరారు అయిపోయింది అని ఆమె అంటున్నారు. అంటే ఆమె దృష్టిలో ఏపీలో ఈవీఎంలు బాగానే పనిచేశాయని ఎన్నికలు సవ్యంగా సాగాయనే భావించాలని అంటున్నారు.

జగన్ కి కేవలం 11 సీట్లనే జనాలు ఇవ్వదలచుకున్నారని అది సరైన తీర్పు అనే షర్మిల భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ కాంగ్రెస్ పట్ల ఏ విధమైన సాఫ్ట్ కార్నర్ చూపించినా షర్మిల మాత్రం కాదూ కూడదనే ధోరణిలోనే ఉంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి చెల్లెమ్మ రాజకీయం ఏమిటో కానీ అటు ఎన్డీయేకు కాకుండా ఇటు ఇండియా కూటమికి లేకుండా జగన్ మధ్యలో ఉండిపోతారా అన్న చర్చ అయితే సాగుతోంది మరి.

Tags:    

Similar News