పీసీసీ ఛీఫ్ గా షర్మిల... తెరపైకి ఆంధ్రరత్న భవన్ పరిస్థితి!
ఈ సమయంలో షర్మిల ఎంట్రీ వేళ ఆంధ్రరత్న భవన్ పరిస్థితి మరోసారి చర్చకు వచ్చింది.
రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే విషయం తెలిసిందే. వైఎస్సార్ హయాంలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ పరిస్థితి ఏపీలో ఒక్కసారిగా దారుణంగా మారిపోయింది. జెండా పట్టే కార్యకర్త కానీ, పోటీకి నిలబడే నాయకుడు కానీ లేరన్నట్లుగా మారిపోయిందనే చర్చ నడిచింది. ఈ సమయంలో షర్మిల ఎంట్రీ వేళ ఆంధ్రరత్న భవన్ పరిస్థితి మరోసారి చర్చకు వచ్చింది.
అవును... ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం బాధ్యతలు చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్రంలో అంపశయ్యపై ఉందనే కామెంట్లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు షర్మిళపై ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి తగ్గట్లుగానే ఆంధ్రరత్న భవన్ కూడా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వివరాళ్లోకి వెళ్తే... ఆదివారం ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వాస్తవానికి ఈ కీలక కార్యక్రమం.. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అయిన గవర్నర్ పేటలోని ఆంధ్రరత్నభవన్ లో జరగాల్సి ఉంది! అయితే... షర్మిల పీసీసీ ఛీఫ్ గా ఆంధ్రరత్న భవన్ లో బాధ్యతలు చేపట్టే పరిస్థితి లేదు. కారణం ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న పరిస్థితి!
చారిత్రక ఆంధ్రరత్న భవన్ ఇప్పుడు శిధిలావస్థలో ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా... పెచ్చులూడిపోయిన స్లాబ్, బీటలు వారిన గోడలు, పైపైన రంగులు వేసి మేకప్ చేసిన పరిస్థితుల్లో ఉంది! ఈ పరిస్థితుల్లో కాస్త ఎక్కువమంది కార్యకర్తలు అక్కడకు చేరితే ఆ భవనం కూలిపోయే ప్రమాధం లేకపోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో వెన్యూని మార్చాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో... ఆహ్వానం ఫంక్షన్ హాల్లో వైస్ షర్మిల పీసీసీ చీఫ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో... అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత... పార్టీ నేతలతో మాత్రమే సమావేశమయ్యేందుకు షర్మిల ఆంధ్రరత్న భవన్ కు వెళ్లనున్నారు. దీంతో... షర్మిళ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసే పనులతో పాటు.. ఆంధ్రరత్న భవన్ ను నిలబెట్టే విషయంపై కూడా దృష్టిసారించాలని కోరుతున్నారు ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలు!