షర్మిలకు కాంగ్రెస్ ఒకే జవాబు...అదే జగన్ మార్క్...!

విభజన పాపాలను తుంగలోకి తొక్కేసి ఏపీలో బలపడాలని పేరాశలకు పోతున్న కాంగ్రెస్ గత కాలం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా జగన్ కెలికి వదిలారు

Update: 2024-02-06 19:44 GMT

విభజన పాపాలను తుంగలోకి తొక్కేసి ఏపీలో బలపడాలని పేరాశలకు పోతున్న కాంగ్రెస్ గత కాలం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా జగన్ కెలికి వదిలారు. ఏపీని అడ్డగోలుగా విభజించారు అని పేరు చెప్పకుండానే కాంగ్రెస్ పాపాల భైరవ పాత్రను అయిదు కోట్ల ఆంధ్రులకు కళ్ళకు కట్టినట్లుగా చూపారు.

నిండు పాల కుండలా ఉన్న ఉమ్మడి ఏపీని కాంగ్రెస్ పార్టీ 2014 టైం లో విభజించింది. అది కూడా దారుణంగా ఒక శాస్త్రీయత లేకుండా ముక్కలు రెండు చేసి పారేసింది. అందుకే జగన్ నాటి దారుణ మారణాన్ని మరోసారి ఏపీ జనాలకు గుర్తు చేస్తున్నారు. ఏపీని విడగొట్టారు. కనీసం ప్రత్యేక హోదాను అయినా చట్టంలో పెట్టి ఉంటే కోర్టుకు వెళ్ళి అయినా సాధించుకునేందుకు వీలు ఉండేది అని కూడా వ్యాఖానించారు.

కేవలం నోటి మాటగానే ప్రత్యేక హోదా అనిపించేశారు అని ఆయన కాంగ్రెస్ కి ఏపీలో కొత్త ప్రెసిడెంట్ అయిన షర్మిలకు ఇండైరెక్ట్ గానే జవాబు చెప్పారు అని అంటున్నారు. అన్నీ మీరే చేసేసి ఇపుడు హోదా ఏదీ ఎక్కడ అంటే ఎలా అన్నట్లుగానే జగన్ మార్క్ నిలదీత సాగింది అనుకోవాలి.

ఇక హైదరాబాద్ మీద ఈ రోజుకీ ఏపీ జనాలకు మనసు ఉంది. అంతటి రాజధాని ఏపీకి ఎప్పటికీ కష్టం అన్న భావన కూడా ఉంది. అందుకే ఆ సెంటిమెంట్ రాజధానిని ఆ సున్నితమైన అంశాన్ని కూడా జగన్ తట్టి జనానికి ఏపీకి జరిగిన అన్యాయం ఏంటి అన్నది చూపించారు.

హైదరాబాద్ వంటి నిధులు పండించే రాజధాని లేకపోవడం వల్ల ఏటా 13 వేల కోట్లు అక్షరాలా నష్టపోతున్నామని అది గత పదేళ్లలో చూసుకుంటే లక్షా 30 వేల కోట్ల రూపాయలుగా లెక్క అవుతుందని కూడా చెప్పుకొచ్చారు.

దేశంలో అనేక రాష్ట్రాలకు ఆర్ధికంగా భరోసా నిధులు అన్నీ రాజధానుల నుంచే వస్తున్నాయని ఆయన ఉదహరించారు. ఏపీకి అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని ఆయన అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. దీని వల్లనే ఏపీ అప్పుల పాలు అయింది అని కూడా విశ్లేషించారు.

కరోనా వంటి సంక్షోభాలను ఏపీ లాంటి రాష్ట్రం తట్టుకోవడం కష్టం అయినా తట్టుకున్నామని ఆయన అన్నారు. అప్పుల విషయంలో కూడా గత ప్రభుత్వం కంటే తక్కువ చేశామని కూడా జగన్ సభ ద్వారా ప్రజలకు వివరించారు. తమ ప్రభుత్వ అయిదేళ్ల ఏలుబడిలో అప్పుల వృద్ధి రేటు 12 శాతంగా ఉంటే చంద్రబాబు అయిదేళ్ల అప్పు వృద్ధి రేటు 21 శాతంగా ఉంది అని ఆయన గణాంకాల ద్వారా వివరించారు. మొత్తానికి ప్రత్యేక హోదా ఏపీకి తెస్తామని ఏపీని స్వర్గతుల్యం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షురాలు అంటున్న నేపధ్యంలో అసలు పాపం కాంగ్రెసే చేసింది సుమా అని జగన్ గుర్తు చేశారు అన్న మాట.

Tags:    

Similar News