షర్మిల.. కడప గడపలో ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఓవైపు అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఓవైపు అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా, ఇంకోవైపు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఇంకో కూటమిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
కాగా కడప గడపలో పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. కడప ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున కడప ఎంపీగా అవినాష్ విజయం సాధించారు. అయితే గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఆయన బెయిల్ పై ఉన్నారు. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డితోపాటు తదితరులు ఇప్పటికే జైలులో ఉన్నారు.
ఈ నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ వివేకా కుమార్తె సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. వారు మొదట టీడీపీ తరఫున పోటీ చేస్తారని టాక్ నడిచినా.. ఇలా చేస్తే వైసీపీ రాజకీయంగా వాడుకునే ప్రమాదం ఉండటంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సునీత లేదా సౌభాగ్యమ్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వారికి కాంగ్రెస్ తోపాటు, టీడీపీ తదితర పార్టీలు అభ్యర్థులను నిలపకుండా మద్దతివ్వచ్చనే ప్రచారం జరిగింది.
అయితే కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటిదాకా షర్మిల తన పోటీపై ఇంకా నిర్ణయించుకోలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం కడప ఎంపీగా బరిలోకి దిగాలని షర్మిలను ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది.
దీంతో వైఎస్ షర్మిల తన కుటుంబ సభ్యులతో మాట్లాడి తన నిర్ణయాన్ని చెబుతానని కాంగ్రెస్ అధిష్టానానికి తెలిపినట్టు తెలుస్తోంది. ఇందుకు ఆమె రెండు రోజులు గడువు అడిగినట్టు సమాచారం. ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులర్పించాక షర్మిల తన కుటుంబ సభ్యులతో తన పోటీపై చర్చిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాతే పోటీపై ఒక నిర్ణయానికి వస్తారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కడప లోక్ సభా స్థానం 1989 నుంచి వైఎస్ కుటుంబం చేతిల్లోనే ఉంది. పలుమార్లు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీలుగా విజయం సాధించారు. 2009, 2012లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కడప ఎంపీగా గెలుపొందారు.
ఈ నేపథ్యంలో షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే వారి కుటుంబం మధ్యే పోటీ జరగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉండి తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ తప్పదని అంటున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.