మోదీకి షర్మిల కౌంటర్‌.. పోలా.. అద్దిరిపోలా!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో అన్ని పార్టీలు జోష్‌ పెంచేశాయి.

Update: 2024-03-18 04:36 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో అన్ని పార్టీలు జోష్‌ పెంచేశాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్, వైసీపీ వేర్వేరు కాదని.. ఈ రెండు పార్టీలు ఒకటేనని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, వైసీపీలు రెండూ ఏపీలో ఒకే కుటుంబం చేతిలో ఉన్నాయని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎన్డీయే కూటమికి పోనివ్వకుండా కాంగ్రెస్‌ కు మళ్లించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మోదీ సంచలన విమర్శలు చేశారు. ఈ మేరకు చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. జగన్‌ ను, చంద్రబాబును ఆడిస్తున్న రింగ్‌ మాస్టర్‌ మోదీయేనని షర్మిల నిప్పులు చెరిగారు. జగన్‌.. మోదీకి దత్తపుత్రుడు అని (ఒక సందర్భంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు) షర్మిల గుర్తు చేశారు. జగన్, చంద్రబాబును రెండు పంజరాల్లో పెట్టి ఆడిస్తూ తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర విభజన జరిగాక పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌ నాశనం కావడంలో ముఖ్య పాత్ర పోషించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాదా అని షర్మిల నిలదీశారు. ఇప్పుడు తనపైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పైగా కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? అని షర్మిల దుయ్యబట్టారు. ఐదేళ్లుగా జగన్‌ తో అంటకాగుతూ, వాళ్ల అరాచకాలను అడ్డుకోకుండా వారికి అడుగడుగునా సహాయ సహకారాలు అందించింది ఎవరని నిలదీశారు. రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయండి.. ఇంకా అప్పులు తెచ్చుకోండి అని తెరచాటు స్నేహం నడిపింది ఎవరిని మోదీపై షర్మిల విరుచుకుపడ్డారు.

పార్లమెంటులో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు వైసీపీ సిగ్గువిడిచి మద్దతు ఇచ్చిందని షర్మిల గుర్తు చేశారు. జగన్‌ ప్రభుత్వం.. మోదీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టడమే కాకుండా వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చిందని మండిపడ్డారు. ఇది వీరి స్నేహం, విడదీయరాని బంధం అంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా , వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు వంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అనే కారణంతో వాటిని బీజేపీ, టీడీపీ, వైసీపీ తుంగలో తొక్కాయని షర్మిల మండిపడ్డారు.

బీజేపీ ప్రభుత్వ అసమర్థత, మోసాలను కప్పిపెట్టి.. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం అని చెప్పినందుకు కాంగ్రెస్‌ పార్టీకి భయపడుతున్నారా అని నిలదీశారు.

Tags:    

Similar News