అన్నను ఎక్కడ టచ్ చేయాలో అక్కడే టచ్ చేస్తున్న షర్మిల!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దీంతో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులు అర్పించి విజయవాడలో బాధ్యతలు చేపట్టిన షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.
ముఖ్యంగా వైసీపీ, వైఎస్ జగన్ పరిపాలనే లక్ష్యంగా తీవ్ర విమర్శానాస్త్రాలు సంధించారు. ప్రధానంగా మణిపూర్ రాష్ట్రంలో 2000 చర్చిలను తగులబెట్టారని, ఎంతోమంది క్రైస్తవులు నిర్వాసితులయ్యారని.. అయినా సరే జగన్ రెడ్డి ఒక క్రైస్తవుడు అయ్యి ఉండి దీనిపై కనీసం స్పందించలేదని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తద్వారా జగన్ కు కీలక ఓటు బ్యాంకుగా ఉన్న క్రైస్తవులపై షర్మిల దృష్టి పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి ఒకప్పుడు కాంగ్రెస్ కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీ, ఎస్టీలు ఉండేవారు. అయితే వైసీపీ ఏర్పాటు తర్వాత, ఏపీ విభజన తర్వాత ఈ వర్గాల్లో అత్యధిక శాతం వైఎస్ జగన్ వైపు మళ్లాయి. 2019 ఎన్నికల్లో ఈ వర్గాలు గంపగుత్తగా వైసీపీకి ఓటేశాయనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు షర్మిల భర్త, ప్రముఖ క్రైస్తవ బోధకుడు అనిల్ కుమార్ సైతం వైసీపీకి అనుకూలంగా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులను ఆ పార్టీవైపు మళ్లించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంటు స్థానాలు దక్కాయని అంటున్నారు.
ఇప్పుడు వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో ప్రధానంగా క్రైస్తవులను తన వైపుకు మళ్లించుకునే వ్యూహానికి పదునుపెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కూడా షర్మిల మణిపూర్ ఘటనలను ప్రధానంగా ఉటంకించారు.
ఇప్పుడు తాజాగా పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన క్రమంలో విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ లో చర్చిల విధ్వంసం, నిర్వాసిత క్రైస్తవుల గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదని షర్మిల నిలదీశారు. తద్వారా క్రైస్తవుల్లో ఒక ఆలోచన రేకెత్తించి వారిని కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవడమే ఆమె ప్రధాన ఉద్దేశమని అంటున్నారు.
ఇప్పటిదాకా వైసీపీకి పెట్టని కోటగా ఉన్న క్రైస్తవుల్లో చీలిక వస్తే అది ప్రధానంగా వైసీపీకే ఇబ్బందవుతుందని అంచనాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన కూటమికి ఎలాంటి నష్టం ఉండదని.. వైసీపీకే డ్యామేజ్ తప్పదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తగ్గట్టే షర్మిల తన అన్న వైఎస్ జగన్ ను ఎక్కడ టచ్ చేయాలో అక్కడే టచ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. మరి షర్మిల విమర్శలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.