చంద్రబాబుతో భేటీపై షర్మిల హాట్‌ కామెంట్స్‌!

టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఎం జగన్‌ సోదరి, కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Update: 2024-01-13 08:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఎం జగన్‌ సోదరి, కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్‌ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని ఆహ్వానించారు. వచ్చే నెల ఫిబ్రవరి 17న వైఎస్‌ రాజారెడ్డి పెళ్లికి కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబును ఆహ్వానించారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి – అట్లూరి ప్రియాలకు పెళ్లి ఫిక్స్‌ అయిన విషయం తెలిసిందే. ఈనెల 18న గోల్కొండ రిసార్ట్‌ లో నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న రాజస్థాన్‌ లో వివాహం జరగనుంది. ఫిబ్రవరి 24న శంషాబాద్‌ లో రిసెప్షన్‌ ను ఏర్పాటు చేశారు.

చంద్రబాబుకు ఆహ్వానం అందించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ షర్మిల హాట్‌ కామెంట్స్‌ చేశారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చంద్రబాబు కుటుంబానికి ఆహ్వాన పత్రికను అందజేశానని తెలిపారు. వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి గురించి ప్రస్తావన వచ్చిందన్నారు. వైఎస్సార్‌ తో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారని తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో వైఎస్, తాను ఎలా కష్టపడ్డారో చంద్రబాబు చెప్పారని షర్మిల తెలిపారు. చంద్రబాబుతో భేటీని రాజకీయంగా చూడొద్దని సూచించారు. చంద్రబాబు వేరే పార్టీ, తాను వేరే పార్టీ అని వెల్లడించారు. ఆయనతో కలిసి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆ అవసరం కూడా రాదని స్పష్టం చేశారు. గతంలో తమ పెళ్లిళ్లకు తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి అందరినీ ఆహ్వానించారని గుర్తు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు సైతం హాజరై తమను ఆశీర్వదించారని షర్మిల గుర్తు చేశారు.

తాను ఇటీవల క్రిస్మస్‌ కేకు పంపితే కొందరు తప్పుబట్టారని షర్మిల మండిపడ్డారు. తాను చంద్రబాబుకే కాదు అందరికీ పంపించానన్నారు. తెలంగాణలో కేటీఆర్, హరీష్‌ రావు, కవితలకు కూడా క్రిస్మస్‌ కేకు పంపించానని వెల్లడించారు. రాజకీయమే జీవితం కాదన్నారు. రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్‌.. రాజకీయాలు అనేది ప్రొఫెషన్‌ అని వెల్లడించారు. ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటామన్నారు. కేవలం తామంతా రాజకీయ ప్రత్యర్థులం మాత్రమేనని చెప్పారు. అందరం ప్రజల కోసమే పనిచేయాలని తెలిపారు. పండుగకో, పెళ్లికో కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదని షర్మిల హాట్‌ కామెంట్స్‌ చేశారు.

తెలంగాణలో తన పాత్ర ఏమిటో కాంగ్రెస్‌ అదిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. తాను కాంగ్రెస్‌ లో ఓ కార్యకర్తనని.. అధిష్టానం ఏ బాధ్యత ఇస్తే దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడం తన బాధ్యత అని తెలిపారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవాలని, రాహుల్‌ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుందని తెలిపారు. రాహుల్‌ ను ప్రధానిని చేయడమే వైఎస్‌ఆర్‌ లక్ష్యం అని షర్మిల గుర్తు చేశారు.

కాగా ఇప్పటికే షర్మిల పలువురు రాజకీయ ప్రముఖులకు కుమారుడి వివాహానికి సంబంధించిన శుభలేఖలు అందజేస్తూ వివాహానికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తాడేపల్లిలోని తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నివాసానికి వెళ్లి వివాహ శుభలేఖను అందజేశారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల నివాసాలకు వెళ్లిన షర్మిల.. కుమారుడి వివాహా శుభలేఖను అందజేశారు.

Tags:    

Similar News