షర్మిల రచ్చ!

తాజా పరిణామాలతో వైసీపీ, కాంగ్రెస్ మధ్య ప్రతిరోజు ఏదో ఒక రచ్చ జరుగుతునే ఉంది. ఈ నేపధ్యంలోనే రేపటినుండి షర్మిల జనాల్లోకి వెళ్ళబోతున్నారు.

Update: 2024-02-04 14:30 GMT

కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల కొద్దిరోజులు వరుసగా రచ్చరచ్చ చేయబోతున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా షర్మిల రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. జగన్ పైన తన ఆరోపటణలను రాజకీయానికి మాత్రమే పరిమితం చేయకుండా వ్యక్తిగత విషయాలతో పాటు ఇంటి వ్యవహారాలను కూడా రచ్చకీడ్చేశారు. దాంతో మొదట్లో షర్మిల వ్యవహారాన్ని చూసి చూడనట్లుగా వదిలేసిన వైసీపీ నేతలు ఇపుడు ఆమెకు ఎక్కడికక్కడ స్ట్రాంగ్ గా ఎదుర్కొంటున్నారు.

తాజా పరిణామాలతో వైసీపీ, కాంగ్రెస్ మధ్య ప్రతిరోజు ఏదో ఒక రచ్చ జరుగుతునే ఉంది. ఈ నేపధ్యంలోనే రేపటినుండి షర్మిల జనాల్లోకి వెళ్ళబోతున్నారు. రచ్చబండ కార్యక్రమం పేరుతో బహిరంగసభలు, రోడ్డుషోలకు షర్మిల శ్రీకారం చుట్టబోతున్నారు. మడకశిర నియోజకవర్గంలో మొదలయ్యే రచ్చబండ తర్వాత శింగనమల, నంద్యాల, దర్శి, బాపట్ల, తెనాలి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తుని, నర్పీపట్నం, పాడేరు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఒక చోట రచ్చబండ కార్యక్రమం మరో నియోజకవర్గంలో బహిరంగసభలు జరగబోతున్నాయి.

కార్యెక్రమం, పేరు ఏదైనా జనాలను నేరుగా కలవటమే అసలు ఉద్దేశ్యం. అందుకనే రచ్చబండ కార్యక్రమంలో షర్మిల తన సోదరుడు జగన్ కు వ్యతిరేకంగా ప్రతిరోజు రచ్చచేయటం ఖాయమనే అనిపిస్తోంది. ఎన్నికలు దగ్గరపడేకొద్ది జగన్ కు వ్యతిరేకంగా షర్మిల తన గొంతును మరింతగా పెంచబోతున్నారు. జగన్ పైన డైరెక్టుగా ఎటాక్ చేస్తేనే మీడియాలో ప్రచారం వస్తుందని షర్మిలకు బాగా తెలుసు. అందుకనే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, ప్రభుత్వ పనితీరును వదిలేసి ఆమె జగన్ పై పదేపదే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు.

ఎన్నికలయ్యేంతవరకు షర్మిల ధోరణి ఇలాగే ఉంటుందనటంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న కారణంగా పార్టీకి తన వల్ల ఏదో మేలు జరిగిందని చూపించలేకపోతే షర్మిలకు భవిష్యత్తుండదు. ఇప్పటికే తెలంగాణాలో పార్టీ పెట్టి తర్వాత చాపచుట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. తన పార్టీని జనాలు గుర్తించకపోవటంతో వేరేదారిలేక కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. ఇపుడు ఏపీ కాంగ్రెస్ లో కూడా తన ప్రభావం చూపించకపోతే భవిష్యత్తులో తనకు ఎవరు విలువ ఇవ్వరని షర్మిలకు బాగా తెలుసు.


Tags:    

Similar News