షర్మిలకు పదవీ గండం పొంచి ఉందా ?
దాంతో పాటు షర్మిల పోటీ చేసిన కడపలో సైతం కాంగ్రెస్ కి ఓట్లు ఎంతో కొంత వచ్చాయి కానీ గెలుపు దక్కలేదు.
కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా షర్మిల ఎలా వ్యవహరించారు. ఆమె పెర్ఫార్మెన్స్ ఎంతవరకూ పార్టీకి మేలు చేసింది అంటే అది కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఇటీవలనే సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. దేశంలో చాలా చోట్ల ఇండియా కూటమి సత్తా చాటింది. అయితే ఏపీలో చతికిలపడింది. కూటమి స్వీప్ చేసి పారేసింది.
వైసీపీ వ్యతిరేక ఓటు మొత్తం కూటమిని ట్రాన్స్ ఫర్ అయింది. కాంగ్రెస్ కి ఏ కొంత అయినా దక్కలేదు. దాంతో పాటు షర్మిల పోటీ చేసిన కడపలో సైతం కాంగ్రెస్ కి ఓట్లు ఎంతో కొంత వచ్చాయి కానీ గెలుపు దక్కలేదు. అది పక్కన పెడితే వైసీపీకి ఎంపీ దక్కనీయకుండా చేయాలన్న టార్గెట్ మిస్ అయింది.
ఇక జనవరి నెల మధ్యలో ఏపీసీసీ చీఫ్ పదవిని తీసుకున్న వైఎస్ షర్మిల గడచిన ఆరు నెలలలో ఎలా వ్యవహరించారు పార్టీ బలోపేతం కోసం ఆమె తీసుకున్న చర్యలు ఏమిటి అన్న చర్చ కూడా మొదలైందిట. కాంగ్రెస్ ఓడినా కూడా ఆ పార్టీని అట్టిబెట్టుకుని చాలా మంది సీనియర్లు ఉన్నారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్ వంటి వారు ఉన్నారు. అలాగే ఇంకా చాలా మంది ప్రముఖులు కాంగ్రెస్ జెండా నీడనే ఉన్నారు.
వారిని అందరినీ కలుపుకుని పోవడంతో షర్మిల విఫలం అయ్యారని అంటున్నారు. ఇక ఇటీవల కృష్ణా జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకరి పద్మశ్రీ షర్మిల అందరినీ కలుపుకుని పోలేదని విమర్శలు చేశారు. అలాగే చింతా మోహన్ కూడా షర్మిల వైఖరి మీద విమర్శించారు. అయితే షర్మిల కాంగ్రెస్ ఫిలాసఫీని జనంలోకి తీసుకుని వెళ్ళడం కంటే తన సొంత టార్గెట్ గా జగన్ ని పెట్టుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తూ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అని అంటున్నారు. ఆ లైన్ తప్పు అని కూడా చర్చ సాగుతోంది.
ఇక కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న వారి కంటే వైసీపీ నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇచ్చారు అని ఆరోపణలు వచ్చాయి. మరో వైపు చూస్తే షర్మిల కాంగ్రెస్ కి ఏపీలో పూర్వ వైభవం తీసుకుని రాగలరా అన్న చర్చ కూడా సాగుతోంది. వైఎస్సార్ అభిమానులు జగన్ కి దూరం అయ్యారనడానికి తాజా ఎన్నికల ఫలితాలు నిరూపణ అయ్యాయని అంటున్నారు. అదే వైఎస్సార్ అభిమానులు షర్మిల పట్ల కూడా సానుకూలంగా లేరు అని అంటున్నారు. వైఎస్సార్ కుటుంబం పట్ల వారు కొంత వైముఖ్యతతో ఉన్నారని ఫలితాలు చెబుతున్నాయని అంటున్నారు.
ఈ నేపధ్యంలో బలమైన రెడ్డి సామాజికవర్గం ఏపీలో నలిగిపోతోంది. వారికి మేమున్నామని భరోసా ఇస్తూ వారికి తగిన మర్యాద ఇస్తే కాంగ్రెస్ వైపు చూస్తారు అని అంటున్నారు. వారిని పూర్తి స్థాయిలో కలుపుకుని పోయే పీసీసీ చీఫ్ రావాల్సి ఉంది అని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే ఆ పదవిని ఇస్తూ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుని పోయిన వారికే బాధ్యతలు అప్పగిస్తే ఆటోమేటిక్ గా పార్టీ బలపడుతుందని అంటున్నారు.
దాంతో పాటు వైసీపీ ఓటు బ్యాంక్ టర్న్ కావాలంటే ఆ అన్న చెల్లెలుకు పార్టీ పగ్గాలు కాకుండా బలమైన నాయకుడిని ఎంపిక చేసి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉందిట. ఈ నేపధ్యంలో షర్మిల కూడా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఆమె ఇటీవలే ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని రాహుల్ ప్రియాంకను కలుసుకున్నారు.
ఆ మీదట ఆమె పార్టీని పటిష్టంగా చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఆమె వైఎస్సార్ కి తానే అసలైన వారసురాలిని అని చెప్పుకోవడానికి జూలై 8న వైఎస్సార్ జయంతి వేడుకలను విజయవాడలో పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి తెలంగాణా లోని మంత్రులను సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఈ జయంతి సభ ద్వారా వైఎస్సార్ వారసత్వాన్ని కాంగ్రెస్ వైపుగా మళ్ళించాలని వైసీపీ ఓటు బ్యాంక్ ని కూడా ఈ వైపుగా మళ్ళించాలని భారీ ప్లాన్ నే వేసారు అని అంటున్నారు.
ఈ మీటింగ్ సక్సెస్ తో షర్మిల తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఆ విధంగా తన పదవిని మరింత కాలం గట్టిపరచుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. మరి కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రక్షాళనకు నడుం బిగిస్తే మాత్రం పదవీ గండం పొంచి ఉన్నట్లే అని అంటున్నారు.