షర్మిల కాలు కడప దాటుతుందా ?

వైఎస్ షర్మిల ఆలియాస్ అడుసుమిల్లి షర్మిల. ఆంధ్రా రాజకీయాల్లో ఆమెది ఇప్పుడు విస్మరించలేని పాత్ర

Update: 2024-04-12 05:11 GMT

వైఎస్ షర్మిల ఆలియాస్ అడుసుమిల్లి షర్మిల. ఆంధ్రా రాజకీయాల్లో ఆమెది ఇప్పుడు విస్మరించలేని పాత్ర. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన అన్న జగన్ కు తోడుగా పాదయాత్ర చేపట్టి పార్టీని నిలబెట్టింది షర్మిల. 2019లో ఆంధ్రాలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ కలహాలతో షర్మిల అన్నకు దూరమయింది. అక్కడ అన్నతో పొసగక తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి కొత్త రాజకీయ పార్టీ పెట్టి నేను తెలంగాణ బిడ్డను, ఆడపిల్లను కాదు ఈడ పిల్లను అంటూ 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. పాలేరు నుండి పోటీ చేస్తానని, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రిని నేనే అంటూ ఆఖరుకు ఎన్నికలకు ముందు స్వయంగా తాను పోటీ చేయకుండా, ఎవరినీ పోటీకి దించకుండా బిచానా ఎత్తేసింది.

తెలంగాణలో పార్టీ ఎత్తేసిన షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీసీసీ అధ్యక్షురాలి పదవిని చేపట్టి ఆంధ్రా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వేలుపెట్టినా పట్టించుకోని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఆంధ్రా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ను విమర్శించడం మొదలుపెట్టాక తిరగబడ్డాయి. టీడీపీ. జనసేన, బీజేపీ శ్రేణులకన్నా తీవ్రంగా షర్మిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మీడియా దుమ్మెత్తిపోస్తున్నాయి. అక్కడ తెలంగాణ అని, ఇక్కడ ఆంధ్రా అని మాట్లాడుతూ మాటతప్పని, మడపతిప్పని వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను అని ఎలా చెప్పుకుంటావు ? అని ప్రశ్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీద పోటీకి దిగింది. తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో జగన్, అవినాష్ ల పాత్ర ఉందని ఆరోపిస్తూ జగన్ పాలన మీద దుమ్మెత్తిపోస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా కడప నుండి పోటీ చేస్తున్న షర్మిల ఇతర ప్రాంతాలలో ప్రచారం చేయడం కష్టంగానే కనిపిస్తున్నది.

అసలు కడపలోనే ఆమె పోటీ ప్రభావం ఎంత అన్నది అనుమానాస్పదంగా మారింది. ప్రచారంలో షర్మిల జగన్ పాలనపై చేస్తున్న ఆరోపణలను ఆమె ఉన్న వేదిక నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖండించడం ఈ ఎన్నికల్లో షర్మిల పాత్ర అంతంత మాత్రమేనని అనిపిస్తున్నది. కుటుంబ కలహాలను, విభేధాలను రాజకీయాలకు ముడిపెట్టి కసి తీర్చుకోవాలన్న షర్మిల ఆలోచనలకు ప్రజామద్దతు లభించడం లేదని క్షేత్రస్థాయిలో ఆమె చేస్తున్న ప్రచారాన్ని చూస్తే అర్ధం అవుతున్నది. తెలంగాణలో పార్టీ పెట్టి అసలు పోటీకే దిగకుండా ఆంధ్రా రాజకీయాల్లో అడుగుపెట్టిన షర్మిల అసలు కనీసం కడపలో అయినా కాసింత ప్రభావం చూపుతుందా ? అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News