ఉండవల్లితో షర్మిల భేటీ...!

ఎందుకంటే వైఎస్సార్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఉండవల్లితో టచ్ లోకి రాలేదు.

Update: 2024-01-25 12:31 GMT

మాజీ ఎంపీ కాంగ్రెస్ లో ఒకనాడు చక్రం తిప్పిన ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఇది ఆసక్తికరమైన భేటీ అని చెప్పాలి. ఎందుకంటే వైఎస్సార్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఉండవల్లితో టచ్ లోకి రాలేదు. అపుడపుడు బ్రదర్ అనిల్ మాత్రం ఉండవల్లి వద్దకు వచ్చి పోతూంటారు.

అదే సమయంలో ఏపీ సీఎం జగన్ తో కూడా ఉండవల్లి కలిసిందీ లేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఉండవల్లి ఒక మాట చెప్పారు. తాను ఒకటి రెండు సందర్భాలలో తప్ప షర్మిలను పెద్దగా కలిసింది లేదని. అయితే ఆమె వైఎస్సార్ కి ముద్దుల తనయ అని తనకు తెలుసు అని అన్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండవల్లి లేకపోయినా ఆయన మాత్రం తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటారు.

తరచూ మీడియా ముందుకు వస్తారు. ఆయన ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం మీద విమర్శల జోరు పెంచారు. జగన్ ప్రతీ నియోజకవర్గం ఇంచార్జిలను మారుస్తూ పోతూ ఉండడాన్ని తప్పు పట్టారు. ఇది వికటిస్తే ప్రమాదం అని జోస్యం చెప్పారు. మార్పులు చేసినా గెలుస్తారా అని కూడా ఒక సందేహం వెలిబుచ్చారు. అదే టైం లో ఆయన వైఎస్సార్ కుటుంబంలోని షర్మిల భర్త అనిల్ తో బాగా ఉంటున్నారు.

దీంతో పాటు కాంగ్రెస్ లోనే ఉన్న కేవీపీ రామచంద్రరావుతో ఉండవల్లికి మంచి సాన్నిహిత్యం స్నేహ బంధం ఉంది. ఆ విధంగా చూస్తే కనుక షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకుని వచ్చారని చెబుతున్న కేవీపీ ఆయన స్నేహితుడిగా ఉండవల్లికి ప్రాధాన్యత ఉంది. ఇపుడు షర్మిల ఉండవల్లిని కలవడం వెనక కూడా రాజకీయ అంశాలేమైనా ఉన్నాయా అన్నది చర్చకు వస్తోంది.

మరో వైపు చూస్తే విశాఖలో మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణను కలసిన తరువాత మీడియాతో మాట్లాడిన షర్మిల తమ కుటుంబానికి కొణతాల ఉండవల్లి వంటి వారు ఆప్తులు అని చెప్పారు. దాంతో ఆమె ఇపుడు ఉండవల్లిని అదే అభిమానంతో కలసి ఉంటారని అంటున్నారు. రాజకీయంగా సీనియర్ అయిన ఉండవల్లి నుంచి సలహా సూచనలు కూడా ఆమె తీసుకోవచ్చు అని అంటున్నారు.

ప్రస్తుతం గోదావరి జిల్లాల పర్యటనలో ఉన్న షర్మిల రాజమండ్రిలోని ఉండవల్లి నివాసానికి వచ్చి ఆయనకు కలిశారు ఇద్దరి మధ్యన వర్తమాన రాజకీయాల మీద చర్చ సాగింది అని అంటున్నారు. ఇక షర్మిల వెంట కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు, జేడీ శీలం, కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి తదితరులు ఉన్నారు.

ఇక గత కొంతకాలంగా జిల్లాల పర్యటనలు చేస్తూ వస్తున్న షర్మిల మాజీ కాంగ్రెస్ నేతలను సొంత గూటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొణతాల తాను జనసేనలోనే అని చెప్పేశారు. ఉండవల్లి అయితే రాజకీయాల నుంచి తాను రిటైర్ అయ్యాను అని చెప్పారు. ఇపుడు ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరుతారా అన్న చర్చ వస్తోంది. చూడాలి మరి ఈ భేటీ సారాంశం ఏమిటో.


Tags:    

Similar News