తెలంగాణ ప్రజాభవన్ లో షర్మిల... భట్టితో భేటీ!
ఈ సందర్భంగా కాసేపు ఆయనతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు.
పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయిన అనంతరం వైఎస్ షర్మిల ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. ఇదే సమయంలో తన కుమారుడు రాజారెడ్డి వివాహం జరగనుండటంతో ఆహ్వానపత్రికలు పంచే కార్యక్రమంలో మరింత బిజీ అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో షర్మిల భేటీ అయ్యారు.
అవును... తన కుమారుడి నిశ్చితార్ధం, వివాహ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ప్రజాభవన్ ని వెళ్లిన షర్మిళ... తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాసేపు ఆయనతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు.
"భట్టి అన్నా బాగున్నారా..? కంగ్రాట్యులేషన్..! మీరు డిప్యూటీ సీఎం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని షర్మిల అభినందించారు. అనంతరం కొడుకు వివాహానికి రండి అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి వివాహ పత్రికను అందజేసిన కాంగ్రెస్ నేత షర్మిల.. ఈ నెల 18న రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదిన జరిగే పెండ్లికి రావాలని ఆహ్వానించారు.
ఈ విషయాలనూ, ఇందుకు సంబంధించిన ఫోటోలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇదే విషయాన్ని వైఎస్ షర్మిల తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా... "ఈరోజు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నని కలిసి నా కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించడం జరిగింది" అని వెల్లడించారు.
కాగా తన కుమారుడు వివాహానికి సంబంధించి తొలి ఆహ్వాన పత్రికను ఇడుపుల పాయలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఉంచిన షర్మిళ.. అనంతరం తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వివాహ ఆహ్వాన పత్రికను ఇచ్చారు. కాగా... ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, షర్మిల ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.