షర్మిల రాజకీయం.. జగన్‌తో ఉన్నంతవరకే.. !
జగన్‌ను తిట్టినంతవరకు.. జగన్ పాలనను ఏకేసినంత వరకు మాత్రమే షర్మిలకు మీడియా కానీ.. ఇతర రాజకీయ నాయకులు కానీ.. దన్నుగా ఉంటారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాలు ఎంత వరకు? ఆమె దూకుడు ఎందాకా ప్రొజెక్టు అవుతుం ది? ఆమె ఏం మాట్లాడినా.. ప్రసారం చేసే ఛానళ్లు ఎన్నాళ్లు ఆమెకు దన్నుగా నిలుస్తాయి? ఎన్నాళ్లు లైవ్ ప్రసారాలు చేస్తాయి? ఎన్నాళ్లు చర్చిస్తాయి? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. దీనికి ఒకే ఒక్క ఆన్సర్ వెలుగులోకి వచ్చింది. జగన్‌ను తిట్టినంతవరకు.. జగన్ పాలనను ఏకేసినంత వరకు మాత్రమే షర్మిలకు మీడియా కానీ.. ఇతర రాజకీయ నాయకులు కానీ.. దన్నుగా ఉంటారు.
వన్స్ ఆ గీతను దాటి.. బయటకు వచ్చి.. కూటమి సర్కారుపై విమర్శలు ప్రారంభించిన తర్వాత.. షర్మిల ను పట్టించుకునేవారు.. లైవ్ ప్రసారాలు ఇచ్చేవారు.. ఆమె గురించి చర్చించే వారు కూడా.. కనుమరుగై పోతారని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఓ వర్గం మీడియానే కొన్నాళ్లుగా షర్మిలను ప్రొజెక్టు చేసిన మాట వాస్తవం. ఆమె ఏం మాట్లాడినా.. ఫస్ట్ పేజీలు, బ్రేకింగ్ కవరేజీలు ఇచ్చాయి. దీనికి కారణం.. జగన్ సర్కారును.. ఆమె బలంగా టార్గెట్ చేయడం.. అదేవిధంగా వివేకానందరెడ్డి హత్య కేసును తనకు అనుకూలంగా మార్చుకోవడం.
ఈ రెండు విషయాలు కూడా.. జగన్ సర్కారును బలంగా లక్ష్యం చేసుకుని షర్మిల దూసుకు పోయిన విషయం తెలిసిందే. షర్మిల అధికారంలోకి వచ్చే అవకాశంలేదన్న అందరికీ తెలుసు. పైగా.. జగన్‌ను అధికారంలో నుంచి దింపేందుకు.. షర్మిల దూకుడు తమకు ఉప యోగపడుతుందని టీడీపీ కూడా అంచనా వేసింది. ఈ క్రమంలోనే షర్మిల ఏం మాట్లాడినా.. భారీ ఎత్తున కవరేజీ కనిపించింది. ఆమె మాటలు కూడా.. బలంగా మీడియాల్లో వినిపించాయి.
అయితే.. ఇప్పుడు జగన్ పోయి.. చంద్రబాబు కూటమి సర్కారు వచ్చింది. అయితే.. ఇప్పుడు కూడా.. జగన్ తిట్టినంత వరకు.. మాత్రమే షర్మిలకు రాజకీయంగా ప్రాధాన్యం ఉండే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆమె చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రశ్నలు గుప్పించారు. అంతే! అప్పటి వరకు లైవులు ఇచ్చిన మీడియాలు.. ఫస్ట్ పేజీల్లో పెద్ద ఎత్తున ఫొటోలు వేసి ప్రచురించిన పత్రికలు కూడా.. కనుమరుగై పోయాయి. కనీసం.. షర్మిలను పట్టించుకోలేదు. ఇప్పుడే కాదు.. రేపు పార్టీ పరంగా పుంజుకున్నా.. చంద్రబాబు సర్కారుకు చెందిన 1 శాతం ఓటు బ్యాంకును ప్రభావితం చేసే స్థాయికి షర్మిల చేరుకున్నా.. ఆమె పరిస్థితి ఇంతే..!