జగన్ కి భారీ షాక్ ఇవ్వనున్న షర్మిల... టీడీపీ కూటమి బిగ్ ట్విస్ట్...!?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకైక సోదరి షర్మిల ఏకంగా అన్నకే భారీ షాక్ ఇవ్వబోతున్నారు.

Update: 2024-04-01 08:21 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకైక సోదరి షర్మిల ఏకంగా అన్నకే భారీ షాక్ ఇవ్వబోతున్నారు. వైసీపీకి పుట్టిల్లు ఆ పార్టీ తొలిసారిగా ఉనికి చాటుకున్న కడప గడ్డ మీదనే అన్నకు ఎదురు వెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కడప ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పోటీ చేయనున్నారు. దాంతో ఇది వైసీపీకి బిగ్ ట్రబుల్ గా పరిణమించనుంది.

వైసీపీకి కడప పెట్టని కోట అన్నది అందరికీ తెలిసిందే.ఆ కోటను బద్ధలు కొడతానటూ టీడీపీ ఎంత ప్రయత్నం చేసినా కుదరకపోయింది. 2011లో జగన్ వైసీపీని ప్రారంభించి కడప ఎంపీగా ఆ పార్టీ మీద పోటీ చేస్తే దేశమంతా చూసేలా అయిదు లక్షలకు పైబడి మెజారిటీ వచ్చింది. ఆ తరువాత 2014 లో అవినాష్ రెడ్డి తొలిసారి ఎంపీగా కడప నుంచి గెలిచారు.

ఆయనే 2019లో మరోసారి కడప నుంచి గెలిచారు ఇక 2024లో మాత్రం కడప నుంచి కాంగ్రెస్ తరఫున జగన్ సొంత చెల్లెలు షర్మిల పోటీ చేయనుండడం సంచలనం రేపుతోంది. ఆమె పోటీ వల్ల కాంగ్రెస్ గెలవదు కానీ వైసీపీ దారుణంగా నష్టపోతుందని అంచనాలు ఉన్నాయి. షర్మిల పోటీ చేస్తే చీల్చేది కచ్చితంగా వైసీపీ ఓట్లే అని అంటున్నారు వైసీపీకి పడే ప్రతి పది ఓట్లలో మూడు నాలుగు ఓట్లు ఆమె తీసుకున్నా ఆ మేరకు రెట్టింపు నష్టం ఓట్ల పరంగా వైసీపీకి ఉంటుందని అంటున్నారు. అదే టైం లో టీడీపీ కూడా రెట్టింపు లెక్కన లాభపడుతుందని అంటున్నారు.

గడచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కడపలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయని అంటున్నారు. షర్మిల ఢీల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధినాయకత్వం తో చర్చలు జరిపి ఎంపీ సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేయించుకున్నారు. ఇక ఆమె కడప ఎంపీగా పోటీ చేయడం ఖాయం అయింది. అదే టైం లో టీడీపీ కూడా అలెర్ట్ అయింది. కడప జిల్లాలో కీలక నేత మాజీ మంత్రి అయిన ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేయిచేందుకు కూటమి అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.

ఇప్పటిదాకా ఆయన జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్ధిగా ఉన్నారు. ఆయనకు పొత్తులో బీజేపీకి ఇచ్చిన ఈ సీటు దక్కింది. అయితే ఇక్కడ ఆయన సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు ఆయన అయిదేళ్ళుగా పనిచేసుకుంటూ వస్తున్నారు. తనకు టికెట్ రాకపోవడం పట్ల ఆయన మధనపడుతున్నారు. దీంతో వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా కడప ఎంపీ సీటుకు ఆదినారాయణరెడ్డిని పంపించి జమ్మలమడుగు సీటుని టీడీపీ తీసుకోవాలని అనుకుంటోంది. అల భూపేష్ రెడ్డికి క్లియర్ చేస్తోంది.

ఇక ఆదినారాయణరెడ్డి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్ధిగా కడప నుంచి పోటీ చేయనున్నారు. అలా ఆయన పోటీ చేస్తే బీజేపీ జాతీయ నాయకత్వం కూడా కడప వైపు చూస్తుందని కేంద్ర బీజేపీ నాయకత్వం సహాయ సహకారాలు ఉంటే కడప సీటు గెలుచుకోవచ్చు అన్న వ్యూహం ఉంది అంటున్నారు.

ఎటూ వైసీపీ ఓట్లను షర్మిల భారీగా చీల్చుతారు కాబట్టి అంతకు అంతా టీడీపీ కూటమి బలపడి కడప ఎంపీ సీటులో జెండా ఎగరేస్తుందని అంటున్నారు. టీడీపీ పుట్టాక ఇప్పటిదాకా కడప ఎంపీ సీటు గెలుచుకోలేదు. అలాంటిది ఫస్ట్ టైం బీజేపీ ద్వారా ఈ ఎంపీ సీటుని గెలుచుకోవాలని చూస్తోంది.

మొత్తానికి చూస్తే కడప రాజకీయం రసవత్తరంగా మారనుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఆదినారాయణరెడ్డికి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా కడప నుంచి పోటీ చేస్తే నాలుగు లక్షల దాకా ఓట్లు వచ్చాయి. ఆయనకంటూ సొంత బలం ఉందని, ఇపుడు వైసీపీని వీక్ చేస్తే కేంద్ర బీజేపీ సాయం ఉంటే టీడీపీ వ్యూహాలు పనిచేస్తే గెలుపు గుర్రం ఎక్కవచ్చు అన్నది కూటమిపెద్దల అంచనాగా ఉంది.

మరో వైపు చూస్తే కడపలో 1996లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంపీగా పోటీ చేసి కేవలం అయిదు వేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు. అంటే కడప సీటు గెలుచుకోవచ్చు అన్నది పాత లెక్కలు చెబుతున్నాయంటున్నారు. అవినాష్ రెడ్డి మీద వైఎస్ వివెకా హత్య కేసు విషయంలో ఆరోపణలు ప్రత్యర్ధులు చేస్తున్న నేపధ్యం నుంచి చూస్తే ఆయనకు ఈసారి ఎదురీత తప్పదని దాంతో గెలుపు కూటమిదే అవుతుందని కూడా అంచనా కడుతున్నారు.

Tags:    

Similar News