కడప హీట్‌.. తొలిరోజే వారిపై షర్మిల నిప్పులు!

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై ఆయన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-05 08:55 GMT

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై ఆయన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల ఈ మేరకు తన ప్రచారంతోపాటు రాష్ట్రవ్యాప్త ప్రచారానికి వైఎస్సార్‌ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలంలోని అమగంపల్లిలో షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతోపాటు కాంగ్రెస్‌ నేతలు తులసిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలన్నా, హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి (వైఎస్‌ అవినాష్‌ రెడ్డి)కే జగన్‌ మళ్లీ ఎంపీగా టికెట్‌ ఇచ్చారని షర్మిల నిప్పులు చెరిగారు. హంతకులను కాపాడుకునేందుకు జగన్‌ సీఎం పదవిని వాడుకుంటున్నారని మండిపడ్డారు.

తన చిన్నాన్న వివేకాను హత్య చేయించిన వారికే మళ్లీ ఎంపీ టికెట్‌ ఇవ్వడం వల్లే తాను కడప ఎంపీగా బరిలో దిగుతున్నానని షర్మిల తెలిపారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదన్న కారణంతోనే తాను ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు. హంతకులను కాపాడేందుకు జగన్‌ అధికారాన్ని వాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

కడప ఎంపీ స్థానంలో పోటీకి ఒక వైపు రాజశేఖర్‌ రెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాష్‌ రెడ్డి ఉన్నారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మం కోసం ఒకవైపు తానుంటే.. మరోవైపు డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి పోటీలో ఉన్నాడన్నారు. ఎవర్ని గెలిపిస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా గాలికొదిలేశారని షర్మిల ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రాజధాని అనేది లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు అతీగతీ లేదన్నారు.

రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని షర్మిల విమర్శించారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపైనా ఒక్క అడుగూ ముందుకు పడలేదని గుర్తు చేశారు. తన తండ్రి వైఎస్సార్‌ ఉండి ఉంటే అది పూర్తయ్యేదన్నారు.

తన తండ్రి వైఎస్సార్‌ ఐదేళ్లు సీఎంగా ఉన్నారని.. ఎన్నో అద్భుత పథకాలను అమలు చేశారని షర్మిల గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌ మెంట్, జలయజ్ఞం వంటికి ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ప్రజల భవిష్యత్‌ బాగుండాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని షర్మిల ఆకాంక్షించారు.

మొత్తం మీద షర్మిల తన తొలిరోజు ప్రచారంలోనే తన సోదరులు జగన్, అవినాష్‌ రెడ్డిలపై తీవ్ర విమర్శలను ఎక్కుపెట్టారు. ముఖ్యంగా వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ అవినాష్‌ రెడ్డే లక్ష్యంగా వాగ్భాణాలు సంధించారు. వివేకా కుమార్తె సునీత తన మద్దతును ఇప్పటికే షర్మిలకు అందజేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News