రాహుల్ కు ఏఎంకు.. పీఎంకు తేడా తెలీదా?
రాహుల్ వ్యక్తిత్వానికి సంబంధించిన ఈ వ్యాఖ్యలు.. ఆయన ఇమేజ్ ను కాస్తంత దెబ్బ తీసేలా ఉంటాయనటంలో సందేహం లేదు
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె తన తాజా పుస్తకంలో పేర్కొన్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసేలా మారాయి. తన తండ్రి.. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించిన దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి తనతో చేసిన వ్యాఖ్యల్ని ఆయన కుమార్తె తాజా పుస్తకంలో పొందుపర్చారు. రాహుల్ వ్యక్తిత్వానికి సంబంధించిన ఈ వ్యాఖ్యలు.. ఆయన ఇమేజ్ ను కాస్తంత దెబ్బ తీసేలా ఉంటాయనటంలో సందేహం లేదు.
ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తాజాగా ఒక పుస్తకాన్ని రాశారు. 'ప్రణబ్ మై ఫాదర్.. ఏ డాటర్ రిమెంబర్స్' అన్న పేరుతో రాసిన పుస్తకంలో కొన్ని కీలకాంశాల్ని పొందుపర్చారు. ఈ పుస్తకంలో తన తండ్రితో జ్ఞాపకాలతో పాటు పలు అంశాల్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలోనూ.. గాంధీ ఫ్యామిలీతోనూ ఆయనకున్న అనుభవాల్ని ప్రస్తావించారు. రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలపై వెలిబుచ్చిన అనుమానాల్ని సైతం ఇందులో పేర్కొనటం గమానార్హం.
అందుకు ఒక ఉదాహరణను ఆమె ప్రస్తావించారు. పుస్తకంలో ఆమె ఏమన్నారన్నది ఆమె మాటల్లోనే చూస్తే.. ''ఒక రోజు ప్రణబ్ అలవాటు ప్రకారం రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్ లో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆయన్ను చూసేందుకు రాహుల్ వచ్చారు. మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ.. పూజా టైంలో కానీ ఎమైనా అవాంతరం వస్తే ఆయనకు ఇష్టం ఉండదు. అయినప్పటికి దాన్ని పట్టించుకోకుండా రాహుల్ ను కలిసేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. అయితే.. ఆయన్ను రాహుల్ సాయంత్రం వేళలో కలవాల్సి ఉంది. కానీ.. రాహుల్ ఆఫీసు పొరపాటున ఇద్దరి మధ్య ఉదయం సమావేశం ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ విషయం ఒక అధికారి ద్వారా నాకు తెలిసింది. ఈ విషయం గురించి నాన్నను అడిగాను.. ఆయన వెంటనే ఒక మాట అన్నారు. ''రాహుల్ కార్యాలయానికి ఏఎంకు పీఎంకు మధ్య తేడా తెలియకపోతే.. ఒకనాటికి వాళ్లు పీఎంవోను ఎలా నడపగలరు'' అని అన్నట్లుగా శర్మిష్ట తన పుస్తకంలో పేర్కొన్నారు.
రాహుల్ ను మంత్రివర్గంలో చేర్చటం ద్వారా ప్రభుత్వ వ్యవహారాల్లో అనుభవం సంపాదించుకోవాలని ప్రణబ్ సూచన చేశారన్న విషయాన్ని సైతం ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. ఇదే పుస్తకంలో తన తండ్రి ప్రణబ్ ప్రధానమంత్రి పదవిపై ఉన్న ఆసక్తిని దాచుకోలేదు. ఈ సందర్భంగా సోనియా గాంధీ అనుసరించిన విధానాల్ని ఆమె ప్రస్తావించారు. 'ప్రధాని కావాలని ప్రణబ్ అనుకున్నారు. అయితే.. సోనియా తన కుటుంబ ప్రయోజనాల్ని పరిరక్షించుకోవటానికి మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసేందుకు 2004లో మార్గం సుగమం చేశారు. సోనియా అధికారాన్ని తాను సవాలు చేసేవాడినా కాదా అన్నది ప్రశ్న కాదని.. తనకున్న అధికారాన్ని ఎవరూ ప్రశ్నించకూడదన్నట్లు సోనియా భావించారు. తన అధికారాన్ని ప్రశ్నించని వ్యక్తినే ప్రధానిని చేయటం ద్వారా తన సొంత.. కుటుంబ ప్రయోజనాల్ని సోనియా కాపాడుకున్నారు' అంటూ ప్రణబ్ కుమార్తె తన తాజా పుస్తకంలో పేర్కొన్నారు.
చివరగా.. తాను రాసిన పుస్తకాన్ని బహుకరించేందుకు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి.. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన తండ్రి ప్రణబ్ పై ఎప్పటిలాగే ఆదరాభిమానాన్ని చాటారని.. తన తండ్రి పట్ల ఆయనకున్న గౌరవం ఏ మాత్రం తగ్గలేదంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి.. ప్రధాని మోడీతో కలిసిన ఫోటోల్ని షేర్ చేశారు.