వైరల్ పోస్ట్... "దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగాలా"?

వరుసగా రెండో రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-19 05:12 GMT

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి తోడు పొగమంచు కూడా కప్పేయడంతో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) అత్యంత తీవ్రస్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏక్యూఐ 494కి పడిపోయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వరుసగా రెండో రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ప్రస్తుతం ఢిల్లీలో వాతావరణం అత్యంత పేళవంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో పరిస్థితి 494కి పడిపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా... కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ.. 'దేశ రాజధాని ఢిల్లీ కొనసాగాల్సి ఉందా' అంటూ కీలక ప్రశ్న లేవనెత్తారు!

ఢిల్లీలో ఏక్యూఐ వివరాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించిన ఓ టేబుల్ ను పోస్ట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని.. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయని అన్నారు.

ఇదే సమయంలో.. ప్రపంచంలోనే రెండో అత్యంత కాలుష్య నగరంగా ఉన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పోలిస్తే.. ఢిల్లీ ఐదు రెట్లు ఎక్కువగా ప్రమాదకర స్థాయిని కలిగి ఉందని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఇలాంటి విపత్కర పరిస్థితులు చూస్తున్నా.. కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు.

ఇదే క్రమంలో... ప్రతీ ఏట నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదని.. మిగతా సమయాల్లోనూ పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని.. ఇలంటి పరిణామాల మధ్య ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.

కాగా అత్యంత ఘోరంగా ఉన్న ఏక్యూఐ నేపథ్యంలో దేశ రాజధానిలో రెండో రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో... రైళ్ల రాకపోకలకు, విమానాలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో ప్రయాణికులు కాస్త అదనపు సమయం కేటాయించాలంటూ ఎయిర్ లైన్స్ అడ్వైజరీ జారీ చేస్తున్నాయి.

Tags:    

Similar News