కనుబొమలు షేప్ చేయించుకుందని.. విడాకులు!
కనుబొమలు షేప్ చేయించుకుందన్న కారణంగా.. జీవితకాలం ఏలుకుంటానని ప్రమాణం చేసి మరీ అర్థాంగిగా తెచ్చుకున్న భార్యను ఓ ప్రబుద్ధుడు విడాకులతో వదిలించేసుకున్నాడు.
దాంపత్యంలో వివాదాలు.. విభేదాలు.. అదనపు కట్నాలు.. వేధింపుల కారణంగా విడిపోయే జంటలను చూస్తున్నాం. అయినప్పటికీ.. ఆయా జంటలు కలకాలం కలిసి ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి.. చిన్న చిన్న విభేదాలను సర్దు బాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ విడాకులు తగ్గడం లేదు. ఇటీవల సుప్రీంకోర్టు వెల్లడించిన లెక్కల ప్రకారం.. కోటికిపైగా విడాకుల కేసులు దేశంలో పెండింగులో ఉన్నాయి.
ఈ పరిణామాలతో పటిష్టమైన వివాహ వ్యవస్థ ఉన్న దేశాల్లో ముందున్న భారత్.. ఇప్పుడు ముందంజలో ఉంది. తాజాగా వెలుగు చూసిన ఘటన వివాహ వ్యవస్థను మరింత మసకబారేలా చేస్తోందనే వాదన వినిపిస్తోంది. కనుబొమలు షేప్ చేయించుకుందన్న కారణంగా.. జీవితకాలం ఏలుకుంటానని ప్రమాణం చేసి మరీ అర్థాంగిగా తెచ్చుకున్న భార్యను ఓ ప్రబుద్ధుడు విడాకులతో వదిలించేసుకున్నాడు.
ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఐబ్రోస్ షేప్ చేయించుకున్న భార్యపై ఆగ్రహిం చిన భర్త వెంటనే విడాకులు ఇచ్చేశాడు. ఏకంగా సౌదీ అరేబియా నుంచి వీడియో కాల్ చేసి ‘ట్రిపుల్ తలాక్’ చెప్పాడు. దీంతో బిత్తర పోయి.. బెంబేలెత్తిన భార్య .. పోలీసులను ఆశ్రయించింది.
ఎక్కడ జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన గుల్సబా, మహ్మద్ సలీంలకు ఏడాదిన్నర కిందట(2022, జనవరిలో) ముస్లింల సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఇద్దరూ చక్కగానే సంసారం చేసుకుంటున్నారు. ఇంతలో ఉద్యోగం నిమిత్తం సలీం సౌదీ వెళ్లాడు. ఈ క్రమంలో సలీంతో నిత్యం వీడియోకాల్ చేస్తున్న గుల్సబా.. మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఐబ్రోస్ షేప్ చేయించుకుంది.
అయితే.. తనను అడకుండా ఇలా కనుబొమలు షేప్ చేయించుకోవడాన్ని సీరియస్‌గా పరిగణించిన సలీం.. ‘ట్రిపుల్ తలాక్’ చెప్పాడని గుల్సబా కన్నీరుమున్నీరైంది. ముస్లిం వివాహ చట్టం కింద కేసు పెట్టానని వెల్లడించింది. ఏదేమైనా చిన్నచిన్న కారణాలకే.. ట్రిపుల్ తలాక్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 2021లో మోడీ సర్కారు తలాక్‌ను నిషేధిస్తూ చట్టం చేసిన విషయం తెలిసిందే. అయినా.. ఇలాంటి ఘటనలు ఆగడం లేదు.