శ‌వాల జాత‌ర చూడ‌లేకే దేశం వ‌దిలేశా: హ‌సీనా సంచ‌ల‌న లేఖ‌

అంతేకాదు.. త్వ‌ర‌లోనే ప‌రిస్థితి స‌ర్దుమ‌ణుగుతుంద‌ని... తాను దేశానికి తిరిగి వ‌స్తాన‌ని ఆమె ప్ర‌జ‌ల‌కు తెలిపారు.

Update: 2024-08-11 23:30 GMT

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని, ప్ర‌స్తుతం భార‌త్‌లో ఆశ్ర‌యం పొందుతున్న షేక్ హ‌సీనా తాజాగా బంగ్లా దేశ మీడియ‌ను ఉద్దేశించి సంచ‌ల‌న లేఖ రాశారు. ``శ‌వాల జాత‌ర చూడ‌లేకే రాజీనామా చేశా. దేశాన్ని వ‌దిలేశా`` అని హ‌సీనా ఆ లేఖలో స్ప‌ష్టం చేశారు. అస‌లు తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వ‌చ్చిం ది.? ఈ ఏడాది మే నుంచి దేశంలో జ‌రుగుతున్న‌దేంటి? అనే విష‌యాల‌ను చాలా న‌ర్మ‌గ‌ర్భంగా హ‌సీనా వివ‌రించారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే ప‌రిస్థితి స‌ర్దుమ‌ణుగుతుంద‌ని... తాను దేశానికి తిరిగి వ‌స్తాన‌ని ఆమె ప్ర‌జ‌ల‌కు తెలిపారు.

ఆరోప‌ణ‌లు ఇవీ..

అమెరికాకు త‌లవంచి ఉంటే.. త‌న ప‌రిస్థితి మ‌రో విధంగా ఉండేద‌ని హ‌సీనా త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ప్ర‌ధానంగా బంగ్లాదేశ్‌లో వైమానిక‌ స్థావ‌రం ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా త‌న‌ను కోరింద‌ని, అయితే తాను ఆ వ్య‌వ‌హారం వెనుక ఉన్న అస‌లు ఉద్దేశాన్ని గ్ర‌హించి అడ్డుకున్నాన‌ని.. ఇదే త‌న‌కు , త‌న దేశానికి కూడా శాప‌మైంద‌ని హ‌సీనా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అల్ల‌ర్లు, తిరుగుబాటు వెనుక అగ్ర‌రాజ్యం హ‌స్తం ఉంద‌ని ఆమె ఆరోపించారు.

``శ‌వాల జాత‌ర రూడాల‌ని నేను కోరుకోలేదు. వారు(బీఎన్‌పీ-బంగ్లా నేష‌నలిస్టు పార్టీ) విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకొన్నారు. దానిని అంగీకరించలేదు. అందుకే ప‌ద‌వికి రాజీనామా చేశా. ఒకవేళ నేను అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే పదవిలో కొనసాగేదాన్ని`` అని త‌న లేఖ‌లో హ‌సీనా స్ప‌ష్టం చేశారు. అమెరికా స‌హా ఇత‌ర దేశాల వ‌ల‌లో ప‌డొద్ద‌ని ఆమె బంగ్లా పౌరుల‌కు పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే తాను తిరిగి బంగ్లా దేశ్‌లో అడుగు పెడ‌తాన‌న్నారు.

అమెరికాకు ఇబ్బందే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో(9 నెలల్లో తిరిగి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి) అవామీ లీగ్‌ మరోసారి పోటీ చేస్తుంద‌ని ఆమె త‌న పార్టీ నాయ‌కుల‌కు కూడా చెప్పారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటుచేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే.. తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ఆదేశం(అమెరికా) త‌న‌కు ఆఫ‌ర్ ఇచ్చిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా పేర్కొన‌డం.. అమెరికాలోనూ క‌ల‌క‌లం రేపింది. డెమొక్రాట్ల‌ను కేంద్రంగా చేసుకుని రిప‌బ్లిక‌న్లు ఇప్ప‌టికే దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు హ‌సీనా లేఖ మ‌రింత ఇబ్బందిగా మార‌నుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News