ఎంపీ సీటుకు ఆమెది గట్టి ప్రయత్నమే.. 500 కార్లతో ర్యాలీ

2019లో నెల రోజుల ముందు బీఆర్ఎస్ లో చేరి నామా నాగేశ్వరరావు ఎంపీ అయ్యారు.

Update: 2024-02-03 08:57 GMT

ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ప్రత్యేకతే వేరు. ఈ జిల్లాతో అసలు సంబంధమే లేని పీవీ రంగయ్య నాయుడు, నాదెండ్ల భాస్కర్ రావు, రేణుకాచౌదరి వంటి వారు ఇక్కడినుంచి ఎంపీలుగా గెలిచారు. అంతకుముందు జలగం వెంగళరావు, ఆయన సోదరుడు కొండలరావు సైతం ఖమ్మం నుంచి ఎంపీలుగా విజయం సాధించారు. వెంగళరావు, రంగయ్యనాయుడు, రేణుకా కేంద్ర మంత్రులుగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా ఈ ప్రత్యేకతను నిలుపుకొంది ఖమ్మం. 2014లో వైఎస్సార్సీపీ తరఫఉన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా గెలిచారు. 2019లో నెల రోజుల ముందు బీఆర్ఎస్ లో చేరి నామా నాగేశ్వరరావు ఎంపీ అయ్యారు. అయితే, ప్రస్తుతం ఖమ్మం సీటు అత్యంత హాట్ గా మారింది.


సోనియా నుంచి నందిని వరకు

ఖమ్మం ఎంపీ స్థానంలో స్థానికేతరులను ఆదరించే సంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడినుంచి కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని ఈసారి పోటీకి దిగాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కోరుతోంది. ఇప్పటికే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపింది. అయితే, ఖమ్మం నుంచి తామూ బరిలో ఉంటామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భార్య నందిని, సీనియర్ నేత వీహెచ్, వంకాయలపాటి వెంకయ్య చౌదరి (వీవీసీ) సంస్థల ఎండీ రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.

భట్టి భార్య పట్టువిడవడం లేదు

ఖమ్మం లోక్ సభ సీటుకు ఇంత డిమాండ్ ఉన్న నేపథ్యంలోనూ డిప్యూటీ సీఎం భట్టి భార్య మల్లు నందిని మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నారు. తాము పార్టీ కోసం చాలా కష్టపడ్డామని, తన భర్తకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర వేదనకు గురయ్యామంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి ఆ విషయం రాలేదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఇప్పుడు ఖమ్మం సీటు ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్థానానికి దరఖాస్తు కూడా చేసిన ఆమె.. శనివారం ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏకంగా 500 కార్లతో ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో అనుచరులు, కార్యకర్తలతో హైదరాబాద్ గాంధీభవన్ కు బయల్దేరారు.

జనరల్ సీటు.. ఏకోటాలో ఇస్తారో?

ఎస్సీ మాల సామాజికవర్గానికి మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఖమ్మం ఎంపీ సీటు జనరల్. భట్టి-నందిని దంపతులది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. నందిని సామాజికవర్గం మార్వాడి. జనరల్ వర్గమే. దీంతోనే ఆమె ఖమ్మం సీటుకు దరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఉన్నత విద్యావంతురాలైన నందినిని టికెట్ వరిస్తుందో లేదో చూడాలి.


Tags:    

Similar News