"నాకు ప్రభాస్ ఎవరో ఇప్పటికీ తెలియదు!"... షర్మిల కీలక వ్యాఖ్యలు!
ప్రభాస్‌ను తాను నేరుగా ఎప్పుడు చూడను కూడా చూడలేదని షర్మిల వ్యాఖ్యానించారు.
ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని.. ప్రభాస్ అనే వ్యక్తిని తాను ఇప్పటి వరకూ చూడలేదని.. జగన్ తన స్వప్రయోజనాల కోసం తల్లి, చెల్లి పేర్లను వాడుకుంటున్నారని.. జగన్ ఇప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు.. తన అవసరం కోసం తండ్రి పేరును సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టిస్తారు అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల.
అవును... ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు బిలియనీర్, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతం అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడైందంటూ మీడియాతో మాట్లాడిన షర్మిల.. తాజాగా మరోసారి ప్రభాస్ ప్రస్థావనపై మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై నిప్పులు చెరిగారు.
ఇందులో భాగంగా... గతంలో షర్మిలపై జరిగిన ప్రచారానికి, ఆ సమయంలో ఆమె వ్యక్తం చేసిన ఆవేదనకు, చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోని ప్రదర్శిస్తూ జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన షర్మిల... బాలకృష్ణ బిల్డింగ్ లో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని జగన్ ఎంటర్ టైనింగ్ గా చెప్పారని అన్నారు.
నిజంగానే జగన్ కు చెల్లెలిపై ప్రేమ ఉంటే.. బాలకృష్ణ బిల్డింగ్ లోని సిస్టం ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే.. ఐదేళ్లు సీఎంగా ఉండి ఏమి గాడిదలు కాశారని? బాలకృష్ణపై ఎందుకు విచారణ చేపట్టలేదు? అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇదే సమయంలో... ప్రభాస్ కు నాకు సంబంధం ఉందంటూ జరిగిన అసత్య ప్రచారంపై తాను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని షర్మిల ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే... "నేను ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు.. ప్రభాస్ ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు.. నా బిడ్డలపై ప్రమాణం చెబుతున్నాను.. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు" అని షర్మిల పునరుద్ఘాటించారు.
అయితే... జగన్ కు ఇవన్నీ తెలిసి కూడా నాకు వ్యక్తిత్వం లేనట్లు ప్రచారం చేయించారని చెబుతూ.. ప్రభాస్ తో సంబంధం ఉన్నట్లు గత ఐదేళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అని షర్మిల ప్రశ్నించారు. తన వీడియోలు ప్లే చేసి, మైలేజీ వచ్చేటట్లు వాడుకుంటున్నారని అన్నారు.
ఈ సందర్భంగా... "మీకు పేరు వస్తుందంటే తల్లి, చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారు.. నాన్న పేరు సీబీఐ ఛార్జి షీట్ లో పెట్టిస్తారు.. మీకు మీరే సాటి ".. అంటూ షర్మిల తీవ్రస్థాయిలో జగన్ పై మండిపడ్డారు.