నౌకలపై వరుస దాడులు.. ఏం జరుగుతోంది?

ఎర్ర సముద్రం వరకే పరిమితమనుకున్న నౌకలపై దాడులు.. ఇప్పుడు అరేబియా సముద్రం వరకూ విస్తరించడం సంచలనంగా మారింది.

Update: 2023-12-24 11:46 GMT

ఎర్ర సముద్రం వరకే పరిమితమనుకున్న నౌకలపై దాడులు.. ఇప్పుడు అరేబియా సముద్రం వరకూ విస్తరించడం సంచలనంగా మారింది. తాజాగా గుజరాత్ లోని వెరావల్ తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై శనివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. డ్రోన్ లతో జరిగిన ఈ దాడి కలకలం రేపింది. అయితే భారత కోస్ట్ గార్డుకు చెందిన గస్తీ నౌక, పెట్రోలింగ్ విమానం వెళ్లి నౌకలో మంటలు ఆర్పేశాయి. 21 మంది భారతీయులతో పాటు మొత్తం 22 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే నౌకలపై వరుస దాడులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ ఇరాన్ దాడులు చేస్తోందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ఆరోపిస్తోంది. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో రెండు వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడి జరిగింది. యెమెన్లోని హౌతీ రెబెల్స్ కంట్రోల్ లో ఉన్న ప్రదేశం నుంచి వచ్చిన డ్రోన్ లే ఈ దాడులు చేశాయని పెంటగాన్ తెలిపింది.

ఇప్పుడిక అరేబియా సముద్రంలో నౌకపై దాడి జరిగింది. ఈ దాడికి కారణమైన డ్రోన్ ఇరాన్ నుంచి బయల్దేరిందని పెంటగాన్ పేర్కొంది. లైబీరియన్ జెండాతో వస్తున్న ఈ నౌక జపాన్కు చెందిన ఓ కంపెనీ నిర్వహణలో ఉందని వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్తో ఈ నౌకకు సంబంధం ఉందని మారిటైమ్ సెక్యూరిటీ సంస్థ ఆంబ్రే పేర్కొంది. ఈ నౌక ఇజ్రాయెల్ బిజినెస్ మ్యాన్ ఇడన్ ఓఫర్ కు చెందిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అక్టోబర్ 17 తర్వాత వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల సంఖ్య 15కు చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.

Tags:    

Similar News