యూపీలో షాకింగ్ సిత్రం.. భర్తల్ని వదిలేసి 11 మంది భార్యలు జంప్
ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో పదకొండు మంది భార్యలు తమ ప్రియుళ్లతో వెళ్లిపోవటంపై సదరు భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం షాకింగ్ గా మారింది. విన్నంతనే అవాక్కుఅయ్యే ఈ ఉదంతం కొత్త చర్చకు తెర తీసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తమ కుటుంబానికి మంజూరైన ఇళ్లకు సంబంధించి విడుదలైన మొదటి విడత సొమ్ములు బ్యాంక్ ఖాతాలో పడినంతనే.. పదకొండు మంది భార్యలు తమ లవ్వర్లతో కలిసి పారిపోయిన వైనం షాకింగ్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో పదకొండు మంది భార్యలు తమ ప్రియుళ్లతో వెళ్లిపోవటంపై సదరు భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మొదటి విడతగా ప్రభుత్వం నుంచి అందిన ఆర్థిక సాయం రూ.40వేలు బ్యాంకు ఖాతాలో పడ్డాయి. ఈ పథకం కింద భార్యల బ్యాంకు అకౌంట్లోనే డబ్బులు పడతాయి.
ఇలా డబ్బులు తమ ఖాతాలో పడినంతనే వారు తమ భార్యలతో కలిసి వెళ్లిపోయారు. దీంతో సదరు భర్తలు గగ్గోలు పెడుతూ పోలీసుల్ని ఆశ్రయించటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.మహారాజ్ గంజ్ జిల్లాలో మొత్తం 2350 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు అయ్యాయి. జిల్లా పరిధిలోని తుతిబరి, షీత్లాపూర్, చాటియా, రాంనగర్, బకుల్ దిహా, ఖాస్రా, కిషూన్‌పూర్, మేధౌలీ గ్రామాలకు చెందిన లబ్థిదారులు ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన 11 మంది మహిళలు భర్తల్ని మోసం చేసి.. డబ్బులు ఖాతాలో పడినంతనే ఇంటి నుంచి పారిపోయిన నేపథ్యంలో.. రెండో దఫా నిధులు వారి ఖాతాల్లో వేయకుండా నిలిపేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద కుటుంబాలకు రూ.2.5 లక్షల మొత్తాన్ని విడతల వారీగా ఇవ్వటం.. వాటి సాయంతో సొంతిళ్లను నిర్మించుకునే అంశం తెలిసిందే. పథకం ద్వారా ప్రయోజనం పొందిన కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా.. ఇబ్బందుల్ని అధికారులు గుర్తించినా సదరు లబ్ధిదారుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయొచ్చు.
ఇక్కడ.. గమనించాల్సిన అంశం ఏమంటే.. గతంలోనూ ఇదే తరహాలో నలుగురు మహిళలు తమ లవ్వర్లతో వెళ్లిపోగా.. ఈసారి ఆ సంఖ్య పదకొండు. గతంలోనూ ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంటే.. ఈసారీ అదే రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.